Begin typing your search above and press return to search.

విశాఖలో కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ కు మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:43 AM GMT
విశాఖలో కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ కు మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్వనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంలను వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే వీటిపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో ఏపీ హైకోర్టు మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం తెచ్చిన జీవోలను కొట్టేసింది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

కాగా సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అమరావతి రాజధాని రైతులు పలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నం మార్చొద్దని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. తాజాగా ఈ కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారించింది.

ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగింది. ఎంతమంది ప్రభుత్వోద్యోగులను విశాఖకు తీసుకెళుతున్నారు.. అక్కడ ఎన్ని రోజులు ఉంటారు.. ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారనే వివరాల పట్టికను సమర్పించాలని ఆదేశించింది. అలాగే అమరావతి నుంచి కార్యాలయాలను తరలించొద్దని హైకోర్టు సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పు నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. విశాఖలో కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో అక్కడికి కార్యాలయాలను తరలిస్తున్నారన్న భావనతో కార్యాలయాలను తరలించొద్దని సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు అడ్డుగా ఉండటంతో సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో పరోక్షంగా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనానికి పంపాలా.. లేదా సింగిల్‌ జడ్జి వింటే సరిపోతుందా అనే విషయంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది.

సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటు ముసుగులో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారని, సంబంధిత జీవోలను రద్దు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు తదితరులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంపై మరికొందరు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.