Begin typing your search above and press return to search.

రేప్‌ చేసి పెళ్లి చేసుకున్నా.. ఇది మాత్రం కుదరదు: హైకోర్టు సంచలన తీర్పు!

సాధారణంగా యువతులపై అత్యాచారాలు జరిగినప్పుడు నిందితులు లేదా బాధితులు కొన్ని సందర్బాల్లో రాజీకొస్తారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:54 AM GMT
రేప్‌ చేసి పెళ్లి చేసుకున్నా.. ఇది మాత్రం కుదరదు: హైకోర్టు సంచలన తీర్పు!
X

సాధారణంగా యువతులపై అత్యాచారాలు జరిగినప్పుడు నిందితులు లేదా బాధితులు కొన్ని సందర్బాల్లో రాజీకొస్తారు. తమను పెళ్లి చేసుకుంటే కేసు, కోర్టుల జోలికి వెళ్లబోమని బాధితురాలు, ఆమె కుటుంబం రాజీకొస్తారు. అలాగే నిందితులు సైతం జైలుశిక్ష తప్పించుకోవడానికి తాము అత్యాచారం చేసినవారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటారు. ఇలాంటివారికి తాజాగా ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది.

16 ఏళ్ల మైనర్‌ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఎత్తేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడానికి కారణం కాబోదని తేల్చిచెప్పింది. అతడిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని స్పష్టం చేసింది.

బాధితురాలి కుటుంబం, నిందితుడి కుటుంబం మధ్య రాజీ కుదిరినప్పటికీ, దాని ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు విస్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్‌ ప్రస్తావించారు.

ఈ కేసులో 16 ఏళ్ల బాలికతో నిందితుడు చాలాసార్లు శారీకరంగా కలిశాడని కోర్టు పేర్కొంది. దీంతో అతని కారణంగా బాలిక గర్భవతి అయిందని కోర్టు గుర్తు చేసింది. ఈ కేసులో నిందితుడు సదరు బాలికను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నంత మాత్రాన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. సెక్షన్‌ 376 ఐపీసీ, పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6 కింద కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇవి నేర తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నాయని తన తీర్పులో స్పష్టం చేసింది.

నిందితుడు పలుమార్లు తనపై అత్యాచారం చేయడం, అతడి కారణంగా గర్భవతి కావడంతో మరో మార్గం లేక బాధితురాలు అతడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలని కోరుతూ నిందితుడు వేసిన పిటిషన్‌ ని కోర్టు తిరస్కరించింది.. ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్న నేరాలు నాన్‌–కాంపౌండబుల్‌ నేరాలు అని పేర్కొంది.

కాంపౌండబుల్‌ నేరాల్లో ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటివి సమాజానికి విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. బాధితురాలు, నిందితుడికి రాజీ కుదిరినంత మాత్రాన వాటిని కొట్టివేయలేమని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకుని నిందితుడి పిటిషన్‌ ని రద్దు చేసింది. బాధితురాలిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేర తీవ్రత దృష్ట్యా కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.