అస్సాం కేరళ పుదుచ్చేరి: భారీ పోలింగ్...ఎవరు కింగ్ ?
అస్సాంలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్ లకు వెల్లువలా తరలి వచ్చారు. దాంతో గతం కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ నమోదు అయింది.
By: Satya P | 10 April 2026 9:16 AM ISTగతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మూడు రాష్ట్రాల్లో జనాలు జోరెత్తి మరీ ఓటెత్తారు. తమదైన నిర్ణయాధికారాన్ని ఉత్సాహంగా ఉపయోగించుకున్నారు. కాబోయే రాజు ఎవరు అన్నది కచ్చితంగా తేల్చి చెప్పేశారు. రాజకీయ పార్టీల జాతకాలు అన్నీ ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తం అయి ఉన్నాయి. అయితే ఇంతలా పోలిగు కేంద్రాలకు జనాలు జాతర చేసి మరీ పోలింగ్ శాతాన్ని పెంచడం వెనక రహస్యం ఏమిటి అన్నది అంతుబట్టక ప్రధాన రాజకీయ పార్టీలు తలమునకలు అవుతున్నాయి.
రికార్డు స్థాయిలోనే :
అస్సాం, కేరళ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలోని 126 స్థానాలకు కేరళలోని 140 స్థానాలకు పుదుచ్చేరిలోని 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. దాంతో అస్సాంలో 85.40 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 78 శాతం, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక అస్సాం కేరళ పుదుచ్చేరి ఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4వ తేదీన జరగనుంది.
కేరళలో కొత్త చరిత్ర గానే :
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ కేరళలో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావడంతో, రోజంతా పోలింగ్ చురుకుగా సాగింది. ఏకంగా 78 శాతం పైగా పోలింగ్ నమోదు అయింది. దీంతో అధిక ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా ఉందని అధికార ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యూడీఎఫ్ ఇలా మూడు ప్రధాన కూటములు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి, సీపీఎం నాయకుడు పినరయి విజయన్ ధర్మడం నుంచి పోటీ చేయగా, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వి. డి. సతీసన్ పారావూర్ నుంచి పోటీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేమోం నుంచి బరిలో ఉన్నారు.
అస్సాంలో సైతం :
అస్సాంలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్ లకు వెల్లువలా తరలి వచ్చారు. దాంతో గతం కంటే ఎక్కువగా ఈసారి పోలింగ్ నమోదు అయింది. 85 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం అంటే మాములు విషయం కాదని అంటున్నారు. ఓటర్లు అంతా నిర్ణయించుకుని మరీ ఈ విధంగా పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు అని అంటున్నారు. ఇది తమకు అనుకూలం అని అధికార బీజేపీ అంటూంటే విపక్ష కాంగ్రెస్ తమదే అధికారం అని గట్టిగా చెబుతోంది.
పుదుచ్చేరిలో అసాధారణం :
ఇక పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం అంతటా ప్రజాస్వామ్య భాగస్వామ్యం పట్ల ప్రజల్లో ఉన్న అసాధారణ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం మీద 89.78 ఓటింగ్ శాతాన్ని నమోదు చేసి, గతంలో ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. ఇంతకు ముందు అత్యధిక ఓటింగ్ శాతం 2011లో నమోదైంది, అప్పుడు 85.57 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దానిని ఈసారి మించిపోయింది దాంతో ఇక్కడ విజేత ఎవరు అనంది సీరియస్ గానే డిస్కషన్ సాగుతోంది.
అధిక పోలింగ్ సంకేతం :
సాధారణంగా అధిక పోలింగ్ అన్నది విపక్షాల విజయానికి బలమైన సంకేతంగా ఉంటుంది. జనాలు ఇల్లు దాటి పోలింగ్ బూత్ ల దాకా వచ్చారు అంటే కచ్చితమైన నిర్ణయం చెప్పడానికే అని అంటున్నారు. అది అధికారంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటేనే జరుగుతుందని గతంలో అనేక సార్లు రుజువు అయింది. మరి ఆ విధమైన ఫలితాలు ఈసారి వస్తాయా అన్నది చర్చగా ఉంది. అస్సాం, పుదుచ్చేరి లలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉంటే కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉంది. దాంతో అధికార ప్రభుత్వాలు ఉన్న చోట ఈ ఓటింగ్ ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు.
