గన్నవరంలో హై అలర్ట్.. 1000 మందికిపైగా పోలీసులు!
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉదయం పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు.
By: Tupaki Desk | 24 May 2025 3:23 PM ISTఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉదయం పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉందని పేర్కొన్నారు. ఆ వెంటనే గంటల వ్యవధిలో నియోజకవర్గం మొ త్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు 1000 మందికిపైగా పోలీసులను ఇక్కడ మోహరించారు. ఎవరూ బయటకు రావొద్దని.. సభలు, సమావేశాలు పెట్టరాదని మైకులు ద్వారా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వైసీపీనాయకుల ఇళ్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం.
ఎందుకు?
గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలంలో 2019 ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని.. దీనిలో నకిలీ వ్యవహారం చోటు చేసుకుందని.. తహసీల్దార్, రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని పేర్కొంటూ.. ఓ కేసు నమోదైంది. దీనిని విచారిస్తున్న పోలీసులు వంశీని అరెస్టు చేశారు(జైల్లోనే).
ఆ తర్వాత.. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన పోలీసులు.. వంశీని కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం విచారించారు. అయితే.. శనివారం ఉదయం ఆయన జైల్లో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వంశీకి వైద్యసేవలు అందుతున్నాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా వంశీ అనారోగ్యంతోనే ఉన్నారు.
ఈ క్రమంలో వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు గన్నవరం నియోజకవర్గంలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని.. దాడులకు దిగే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్యం మెరుగు పడే వరకు.. గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి అల్లర్లకు, దాడులకు అవకాశం లేకుండా.. హై అలర్ట్ ప్రకటించారు. ఇదేసమయంలో టీడీపీఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నివాసానికి కూడా భారీ భద్రత కల్పించారు.
