కస్టమర్ల సిగ్గే వారికి కోట్లాది రూపాయల ఆదాయం?
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ఈ సరికొత్త ‘పైసల దోపిడీ’ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది.
By: A.N.Kumar | 25 May 2026 7:00 PM ISTహోటల్‌కు వెళ్లి కడుపునిండా తిన్నాక బిల్లు చేతికి రాగానే చాలామంది చూసేది కేవలం ‘టోటల్ అమౌంట్’ మాత్రమే. కానీ ఆ టోటల్ కింద సైలెంట్‌గా దూరిపోయే “రౌండ్ ఆఫ్” అనే చిన్న లైన్‌ను ఎప్పుడైనా గమనించారా? ₹0.20, ₹0.50 లేదా ₹0.99... ఇలా పైసల్లో ఉండే ఈ మొత్తాన్ని తదుపరి రూపాయికి పెంచి వసూలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. "పావలా, అర్ధరూపాయే కదా.. దీనికోసం అడిగితే హోటల్లో మిగతావాళ్లు ఏమనుకుంటారు?" అనే కస్టమర్ల సంకోచమే కొన్ని వ్యాపార సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ఈ సరికొత్త ‘పైసల దోపిడీ’ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది.
₹0.24 పైసల వెనుక అసలు కథ!
ఒక కస్టమర్ తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు బిల్లులో “రౌండ్ ఆఫ్ ₹0.24” అని అదనంగా వేయడం గమనించాడు. దీనిపై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా.. వారు ఇచ్చిన సమాధానం షాక్‌కు గురిచేసింది. "ఇది చాలా చిన్న మొత్తం సార్.. దీని గురించి అడగడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు" అని వారు చాలా తేలికగా తీసిపారేశారు.
ఈ ‘చిన్న మొత్తం’ వెనుక ఉన్న కార్పొరేట్ లెక్కలు చూస్తే సామాన్యుడి బుర్ర తిరగడం ఖాయం. కస్టమర్ల నైతిక సంకోచాన్ని వ్యాపారాలు ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో చెప్పడానికి ఈ కింది గణాంకాలే నిదర్శనం.
ఒక్క రెస్టారెంట్ నెలకు లక్ష మంది కస్టమర్ల నుండి కేవలం యాభై పైసల చొప్పున నొక్కేస్తే.. ఏడాదికి ₹6 లక్షల రూపాయల ఉచిత ఆదాయం సమకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు, సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లు అన్నింటినీ లెక్కిస్తే ఇది వందల కోట్ల రూపాయల స్కామ్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.
డిజిటల్ యుగంలోనూ ఈ ‘రౌండ్ ఆఫ్’ అవసరమా?
పూర్వం చిల్లర నాణేల కొరత ఉన్నప్పుడు రౌండ్ ఆఫ్ పద్ధతికి ఒక అర్థం ఉండేది. కానీ ఇప్పుడు అంతా యూపీఐ , క్రెడిట్/డెబిట్ కార్డుల యుగం నడుస్తోంది. రూపాయి కాదు కదా.. ₹0.01 పైసా ఉన్నా కూడా ఆన్‌లైన్‌లో కచ్చితంగా కట్ చేసుకునే సాంకేతికత అందుబాటులో ఉంది. అలాంటప్పుడు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లలో కస్టమర్లకు నష్టం చేకూర్చేలా, కేవలం పై రూపాయికే రౌండ్ ఆఫ్ అయ్యేలా ఎందుకు డిజైన్ చేస్తున్నారనే ప్రశ్నలు వినియోగదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిపుణుల హెచ్చరిక
చట్టపరంగా రౌండ్ ఆఫ్ విధానం పూర్తిగా తప్పు కాకపోయినప్పటికీ.. కస్టమర్ అనుమతి లేకుండా డిజిటల్ పేమెంట్లలో కూడా అదనపు మొత్తాన్ని జోడించడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది. "ఎవరూ అడగరు కదా" అనే భావనతో వసూలు చేయడం వ్యాపార నైతికతకు పూర్తి విరుద్ధం.
కస్టమర్లు ఏం చేయాలి?
వ్యాపారాల అదనపు ఆదాయానికి కస్టమర్ల “సిగ్గు + అలవాటు + నిర్లక్ష్యం” పెట్టుబడిగా మారుతున్నాయి. అందుకే ఇకపై హోటళ్లు, సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు బిల్లును నిశితంగా పరిశీలించండి. రూపాయి అయినా అర్ధరూపాయి అయినా అది మీ కష్టార్జితం. డిజిటల్ పేమెంట్ చేసేటప్పుడు బిల్లులో ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రశ్నించడం అలవాటు చేసుకుంటేనే ఇలాంటి ‘సైలెంట్ దోపిడీ’లకు అడ్డుకట్ట పడుతుంది.
