Begin typing your search above and press return to search.

టెక్నాలజీ సరదా.. భవిష్యత్తును నాశనం చేస్తుందా?

టెక్నాలజీ అనేది మన జీవితాలను ఎంతో సులభతరం చేసిన అద్భుతమైన సాధనం. కానీ, కేవలం కాలక్షేపం మరియు వినోదం కోసం మనం దానిని వాడుతున్న తీరు ఇప్పుడు సమాజానికి పెద్ద హెచ్చరికగా మారింది.

By:  Madhu Reddy   |   17 Sept 2026 10:55 AM IST
టెక్నాలజీ సరదా.. భవిష్యత్తును నాశనం చేస్తుందా?
X

టెక్నాలజీ అనేది మన జీవితాలను ఎంతో సులభతరం చేసిన అద్భుతమైన సాధనం. కానీ, కేవలం కాలక్షేపం మరియు వినోదం కోసం మనం దానిని వాడుతున్న తీరు ఇప్పుడు సమాజానికి పెద్ద హెచ్చరికగా మారింది. గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం నుండి ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడటం వరకు మన అలవాట్లు రూపుమారుతున్నాయి. ఈ సరదా వెనుక మన ఆరోగ్యం, మేధస్సు మాత్రమే కాకుండా పర్యావరణం కూడా ఎంత ప్రమాదంలో పడుతుందో తెలుసుకుందాం.

సమయం వృథా అండ్ పనుల వాయిదా:

రీల్స్, షార్ట్స్, ఆన్‌లైన్ గేమ్స్ మోజులో పడి గంటల తరబడి విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు తమ ముఖ్యమైన బాధ్యతలను పక్కన పెట్టి ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల వారి కెరీర్ ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి చిన్న పనిని వాయిదా వేసే బద్ధకం పెరిగిపోయి, జీవితంలో వెనుకబడిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.

ఆరోగ్యం పై పడుతున్న దెబ్బ :

నిరంతరం స్క్రీన్ వైపే చూడటం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వల్ల డిప్రెషన్, ఒంటరితనం, ఆందోళన పెరుగుతున్నాయి. ఇక మరోవైపు నిద్రలేమి, కంటి చూపు సమస్యలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం వంటి రోగాలు చుట్టుముడుతున్నాయి.

తగ్గిపోతున్న ఆలోచనా శక్తి :

గూగుల్, ఏఐ (AI) టూల్స్ అందుబాటులోకి వచ్చాక మానవ మెదడుకు పని తగ్గపోయింది. రెడీమేడ్ సమాధానాలు దొరుకుతుండటంతో సొంతంగా ఆలోచించే సృజనాత్మకత, జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నాయి. ఇక చిన్న చిన్న విషయాలకు కూడా టెక్నాలజీపై ఆధారపడటం వల్ల మెదడు ప్రాథమిక విశ్లేషణా శక్తిని కోల్పోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీటి కొరత మరియు పర్యావరణ ముప్పు :

మన సరదా డిజిటల్ ప్రపంచం వెనుక కోట్ల లీటర్ల నీరు ఖర్చవుతోంది. డేటా సెంటర్ల సర్వర్లను చల్లబరచడానికి, సెమీకండక్టర్ చిప్స్ తయారీకి లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీరు అవసరం. ఇక ఏఐ మోడల్స్ ద్వారా మనం చేసే ప్రతి 10 నుండి 50 శోధనలకు దాదాపు అర లీటర్ నీరు ఖర్చవుతుంది. ట్రెండ్ కోసం ప్రతి చిన్నదానికీ ఏఐని వాడటం వల్ల ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతోంది.

టెక్నాలజీ లేదా ఏఐ అనేది మన అవసరానికి వాడుకోవాల్సిన ఒక సాధనం మాత్రమే. కానీ సరదా కోసం లేదా ట్రెండ్ పేరిట దానిని విపరీతంగా వాడితే భవిష్యత్తును మన చేతులారా నాశనం చేసుకున్నట్లే అవుతుంది. ఇక ఇప్పటికైనా సరైన అవగాహనతో, పరిమితంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని, రేపటి తరం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.