Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగు హీరో!

అనంతరం... రాష్ట్రంలో కాదు దేశంలోని తెలుగు వారికి సేవ చేయాలనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 10:15 AM GMT
కాంగ్రెస్  పార్టీలో చేరిన తెలుగు హీరో!
X

వెన్నెల, ఆనంద్ లాంటి సినిమాలతో పక్కింటి అబ్బాయిగా ముద్ర వేసుకుని అందర్నీ ఆకట్టుకున్న హీరో రాజా... రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన రాజా... అసలు పేరు రాజా అబేల్.

అవును... ముఖ్యంగా "ఆనంద్" లాంటి మంచి కాఫీ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన రాజా... తల్లి బ్రిటిషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలో... సినిమాలపై ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజా.. హీరో శ్రీకాంత్ హీరోగా వచ్చిన "ఓ చిన్నదాన" సినిమాతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.

అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఆనంద్" సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజా.. ఆ తరువాత కథల ఎంపికలో క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోలేదనే కామెంట్లను సొంతం చేసుకోలేదని చెబుతుంటారు. ఈ క్రమంలో సినిమాలకు దూరమైన ఆయన ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి పాస్టర్ అయ్యారు. ప్రస్తుతం దైవ సేవకులుగా ఉన్న ఆయన... ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇందులో భాగంగా... విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గిడుగు‌ రుద్రరాజు సమక్షంలో రాజకీయంగా తిరిగి సొంత గూటికి చేరారు.

పార్టీలో జాయిన్ అయిన అనంతరం మైకందుకున్న ఆయన... కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. అలాంటి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని అన్నారు. అనంతరం... రాష్ట్రంలో కాదు దేశంలోని తెలుగు వారికి సేవ చేయాలనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.

ఇదే సమయంలో... మణిపూర్ అల్లర్ల ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన అభినందనీయమని.. దేశంలో ఎవ్వరూ సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని రాజా తెలిపారు. అదే స్పూర్తితో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు రాజా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చుతుందని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.