Begin typing your search above and press return to search.

బీజేపీ తొలి జాబితాలో స్టార్‌ హీరో, స్టార్‌ హీరోయిన్‌!

ఇందులో భాగంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ లకు సీట్లు ఇవ్వవచ్చని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 9:45 AM GMT
బీజేపీ తొలి జాబితాలో స్టార్‌ హీరో, స్టార్‌ హీరోయిన్‌!
X

మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈసారి ఒంటరిగానే 300 స్థానాలు సాధించాలని తలపోస్తోంది. ఎన్డీయే కూటమితో కలిపి 400 ఎంపీ స్థానాలు గెల్చుకోవాలని గట్టి కంకణం కట్టుకుంది.

కాగా వచ్చే ఎన్నికల్లో లోక్‌ సభకు బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గెలుపే లక్ష్యంగా గట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ లకు సీట్లు ఇవ్వవచ్చని చెబుతున్నారు.

అక్షయ్‌ కుమార్, కంగనా రనౌత్‌ ల పేర్లు బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలోనే ఉంటాయంటున్నారు. మొత్తం 110 మంది అభ్యర్థుల పేర్లతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను నేడో, రేపో విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

కాగా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే ఆమె బీజేపీ తరఫున పోటీకి ప్రయత్నించారు. ఆమె సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. ఇక అక్షయ్‌ కుమార్‌ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి హీరో అక్షయ్‌ కుమార్‌ ను, హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ ను బరిలోకి దింపొచ్చని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇటీవల కంగన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీజేపీలో చేరితే స్వాగతిస్తామని గతంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలిపారు.

ఇప్పటికే బీజేపీ తరఫున నటులు రవికిషన్‌ (రేసుగుర్రం సినిమా విలన్‌), సన్నీడియోల్‌ (బాలీవుడ్‌ హీరో), ఒకప్పటి బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలిని వంటివారు ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు కంగన, అక్షయ్‌ కుమార్‌ కూడా వస్తే ఆ పార్టీకి సినీ గ్లామర్‌ తోడవుతుందనే అంచనాలు ఉన్నాయి.

కాగా బీజేపీ తొలి జాబితాలో 110 మందికి పైగా పేర్లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్‌ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌ నుంచి గాంధీనగర్‌ నుంచే బరిలో దిగుతారని తెలుస్తోంది. ఈ 110లో చాలాచోట్ల సిట్టింగ్‌ ఎంపీలకే సీట్లు కేటాయిస్తారని అంటున్నారు.