Begin typing your search above and press return to search.

తాజాగా యునెస్కో గుర్తింపు దక్కించుకున్న భారత్‌ కట్టడాలు ఇవే!

ప్రపంచ చారిత్రిక, సాంస్కృతిక, అరుదైన కట్టడాలకు ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో గుర్తింపు ఇస్తుందన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Sep 2023 12:30 PM GMT
తాజాగా యునెస్కో గుర్తింపు దక్కించుకున్న భారత్‌ కట్టడాలు ఇవే!
X

ప్రపంచ చారిత్రిక, సాంస్కృతిక, అరుదైన కట్టడాలకు ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో గుర్తింపు ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలను, ప్రాంతాలను దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు మొగ్గుచూపుతుంటారు. గుర్తింపు దక్కించుకున్న కట్టడాలను యునెస్కో తన వెబ్‌సైటులో పేర్కొంటోంది. ఇప్పటికే తెలంగాణలో రామప్ప గుడికి, కర్ణాటకలో హంపి కట్టడాలు, ఆగ్రాలో తాజమహల్‌ ఇలా ఎన్నో వాటికి యునెస్కో గుర్తింపు లభించింది.

ఇప్పుడు తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్‌ లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని 'హోయసల' ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో తెలిపింది. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన బేలూర్, హళేబీడ్, సోమనాథపుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. జైన దేవాలయాలుగా బేలూర్, హళేబీడ్‌ లకు గుర్తింపు ఉంది.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ 'వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ'లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యునెస్కో వెల్లడించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ లోని 'శాంతినికేతన్‌'కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. హోయసల పవిత్ర ఆలయాలు 2014 ఏప్రిల్‌ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిరక్షణ బాధ్యతలను ఆర్కియాలాజిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వర్తిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌ లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి, జాతీయ గీతం జనగణమన సృష్తికర్త.. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వందేళ్లకు ముందు నిర్మించిన 'విశ్వభారతి' విశ్వవిద్యాలయానికి నెలవైన శాంతినికేతన్‌ కు యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు.

కోల్‌ కతాకు సుమారు 160 కి.మీ. దూరంలో బోల్పుర్‌ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్‌ ను రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తండ్రి దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ 1863లో ఆశ్రమంలా నిర్మించారు. ఇది భారత పునరుజ్జీవనోద్యమంలో కీలక పాత్ర పోషించింది. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీని నిర్మాణాన్ని చేపట్టారు. 1921లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇక్కడ 'విశ్వభారతి' విద్యాలయాన్ని స్థాపించారు. 1951లో దానికి కేంద్ర విశ్వవిద్యాలయ హోదా దక్కింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ హోదా పొందిన ఏకైక వర్సిటీ ఇదే కావడం విశేషం.

కాగా హోయసలకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో హోయసలకు చోటు లభించడం భారత్‌ కు ఎంతో గర్వకారణమన్నారు. ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనం అని ట్వీట్‌ చేశారు.