Begin typing your search above and press return to search.

దారుణం... భార్య, బిడ్డ ఉన్న గదిలోకి పాముని వదిలాడు!

అవును... భార్య మీద కోపంతో అనుమానం రాకుండా భార్య, త‌న రెండేళ్ల కుమార్తె నిద్రిస్తున్న స‌మ‌యంలో గదిలోకి విషపూరితమైన పామును వదిలి వారిని చంపేసాడు ఓ క‌సాయి భ‌ర్త.

By:  Tupaki Desk   |   24 Nov 2023 8:57 AM GMT
దారుణం... భార్య, బిడ్డ ఉన్న గదిలోకి పాముని వదిలాడు!
X

అత్యంత దారుణమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్యమీద కోపంతో ఒక వ్యక్తి అత్యంత విషపూరిత నిర్ణయం తీసుకున్నాడు. బుర్ర నిండా విషం నింపుకున్న ఆ వ్యక్తి తన భార్య నిద్రిస్తున్న గదిలోకి పాముని వదిలాడు. ఇదే సమయంలో ఆ గదిలో అతడి భార్యతో పాటు రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో పాము ఇద్దరినీ కాటువేసింది!

అవును... భార్య మీద కోపంతో అనుమానం రాకుండా భార్య, త‌న రెండేళ్ల కుమార్తె నిద్రిస్తున్న స‌మ‌యంలో గదిలోకి విషపూరితమైన పామును వదిలి వారిని చంపేసాడు ఓ క‌సాయి భ‌ర్త. ఈ సంఘ‌ట‌న తాజాగా ఒడిశాలో చోటుచేసుకుంది. పోస్టు మార్టం రిపోర్టులో పాము కాటుకు గురై చ‌నిపోయార‌ని తెలియడంతో నిందితుడు రిలాక్స్ అయ్యాడు.. ఇక సమస్య లేదనుకున్నట్లున్నాడు.. కానీ అసలు విషయం అక్కడే బయటపడింది.

వివరాళ్లోకి వెళ్తే... గంజాం జిల్లాలోని కబిసూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధీగావ్‌ కు చెందిన గణేశ్ పాత్రాకు 23ఏళ్ల బసంతి పాత్రాతో 2020 లో వివాహం జ‌రిగింది. వీరిద్దరికి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఈ భార్యాభర్తలిద్దరూ త‌ర‌చూ చిన్న చిన్న విష‌యాల‌కే గొడ‌వ‌ప‌డేవారు. దీంతో ఇకపై ఆమె అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు! ఇందులో భాగంగా తన చేతికి మట్టి అంటకూడదని భావించి ఒక నిర్ణయం తీసుకున్నాడు.

దీంతో అనుకున్నదే తడవుగా... పాములు పట్టే వ్యక్తి నుంచి ఓ విషపూరిత పామును సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్‌ లో పెట్టి అక్టోబరు 6న ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో తీసుకొచ్చాడు. ఆ స‌మ‌యంలో ఇంట్లో అంతా నిద్రావ‌స్థలో ఉన్నారు. ఈ సమయంలో ఆ పామును తీసుకెళ్లీ భార్య, కుమార్తె నిద్రపోతున్న గదిలో వదిలేశాడు. ఆ త‌ర్వాత ఏమీ తెలియ‌నట్లు వేరే గ‌దిలోకెళ్లి నిద్రపోయాడు.

ఈ క్రమంలో మ‌రుస‌టి రోజు ఉదయం చూసేసరికి భార్య, కుమార్తె ఇద్దరూ విగ‌త‌జీవులై ప‌డి ఉన్నారు. పోస్ట్ మార్టంలో పాము కాటువల్ల మరణించినట్లు తెలిసింది. ఇక గణేష్ ఊపిరి పీల్చుకున్నట్లున్నాడు. అయితే, అల్లుడి ప్రవ‌ర్తన‌పై అనుమానం వ్యక్తం చేసిన బసంతి పాత్రా తండ్రి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు వారి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇందులో భాగంగా తన భార్య, కుమార్తె నిద్రిస్తున్న గదిలోకి తానే స్వయంగా పామును వదిలినట్టు నిందితుడు అంగీక‌రించాడు. దానివెనక జరిగిన కథంతా వివరించాడంట. దాంతో అత‌నిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు. స్థానికంగా ఈ విషయం తీవ్ర కలకలం రేపింది.