Begin typing your search above and press return to search.

26 ఏళ్ల యువ‌కుడు.. వారాల త‌ర‌బ‌డి నిద్ర‌.. ఎక్క‌డ‌? రీజ‌నేంటి?

ఇదిలావుంటే, అస‌లు.. వారాల త‌ర‌బ‌డి నిద్ర‌పోవ‌డం.. ఎంత లేపినా లేవ‌క‌పోవ‌డం.. వంటివి ఇప్పుడు కొత్త‌గా వెలుగు చూస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 1:30 AM GMT
26 ఏళ్ల యువ‌కుడు.. వారాల త‌ర‌బ‌డి నిద్ర‌.. ఎక్క‌డ‌?  రీజ‌నేంటి?
X

స‌గ‌టున మ‌నిషికి రోజుకు 8 గంట‌ల నిద్ర అవ‌స‌రం. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ మాత్రం నిద్ర అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతుం టారు. అయితే..ఇంత‌క‌న్నా ఎక్కువ‌గా ఓ రెండు మూడు గంట‌లు ప‌డుకునేవారు.. త‌క్కువ‌గా నిద్రించేవారు కూడా ఉన్నారు. ఇక‌, అతి నిద్ర అయినా.. నిద్ర‌లేమి అయినా.. రెండు ప్ర‌మాద‌మేన‌ని వైద్యులు చెబుతుంటారు. ఇదిలావుంటే, అస‌లు.. వారాల త‌ర‌బ‌డి నిద్ర‌పోవ‌డం.. ఎంత లేపినా లేవ‌క‌పోవ‌డం.. వంటివి ఇప్పుడు కొత్త‌గా వెలుగు చూస్తున్నాయి. అయితే.. ఇవి అనారోగ్య‌క‌ర ల‌క్ష‌ణాల‌ని వైద్యులు చెబుతున్నారు.

మ‌నిషి స‌గ‌టు కంటే ఎక్కువ‌గా నిద్రించినా.. అస‌లు నిద్ర‌లేక‌పోయినా..ఆరోగ్యం దెబ్బ‌తిన‌డం అనేది స‌హ‌జం. కానీ,తాజాగా రెండు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఘ‌ట‌న‌లు యువ‌కుల్లో క్లీన్ లెవిన్ సిండ్రోమ్‌(కేఎల్ ఎస్‌) అనే వ్యాధికి దారితీస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. ఈ సిండ్రోమ్ ఉన్న‌వారిలో అధిక నిద్ర ప్ర‌ధాన స‌మ‌స్య‌. అంటే.. గంట‌లు కాదు.. ఏకంగా రోజులు, వారాల త‌ర‌బ‌డి వీరు నిద్ర‌లోనే ఉంటారు. ఎంత లేపినా లేవ‌రు. కేవ‌లం దైనందిన చ‌ర్య‌ల కోసం(ఆహారం, మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న‌) మాత్ర‌మే లేస్తారు. అది కూడా మ‌గ‌త‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

తాజా కేసు ఇదీ..

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని 26 ఏళ్ల యువ‌కుడు ఎనిమిది రోజుల పాటు నిద్ర‌లోనే గ‌డిపాడు. ఎంత లేపినా లేవ‌డం లేదు. అంతేకాదు.. స‌ద‌రు యువ‌కుడు ``నేను త్వ‌ర‌గా నిద్ర‌లేవాలి`` అని మ‌న‌సులో అనుకుని ప‌డుకున్న‌ప్ప‌టికీ.. లేవ‌లేని స్థితికి వెళ్లిపోతున్నాడు. దీంతో అతని కుటుంబ స‌భ్యులు ప‌లువురు వైద్యుల చుట్టూ తిప్పారు. ప‌లు ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు.. యువ‌కుడిలో కేఎల్ ఎస్ వ్యాధి ఉంద‌ని గుర్తించారు. అయితే.. ఈ వ్యాధికి గల ఖచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు.

అంతేకాదు.. ఈ వ్యాధి చాలా అరుదు అని వెల్లడించారు. ఈ వ్యాధికి స్పష్టమైన కారణం లేదు. కారణం వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ చకోర్ మాట్లాడుతూ.. 12 నుంచి 25 ఏళ్లలోపు టీనేజర్లు, యువకుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని తెలిపారు. వైద్యులు ఈ వ్యాధిని ‘కుంభకర్ణ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. అయితే, ప్రపంచంలో అత్యంత కొద్ది మందిలో మాత్రమే ఈ అరుదైన వ్యాధి కనిపిస్తుందన్నారు.

గ‌తంలోనూ ఇదే త‌ర‌హా వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌కుడి గురించి వార్త‌లు వ‌చ్చాయి. రాజస్ధాన్ లోని నాగౌర్ జిల్లా భద్వా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇలాంటి వింత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలిసింది. అతడు కూడా ఇలానే రోజుల తరబడి నిద్రపోతుంటాడ‌ట‌.