Begin typing your search above and press return to search.

దెబ్బకు అడ్వాణీ ఇంటికి వచ్చి ఆహ్వానపత్రాలు చేతిలో పెట్టారు

ఇప్పుడు వీరిద్దరిలో అడ్వాణీకి 96 ఏళ్లు అయితే.. మురళీమనోహర్ జోషికి మాత్రం 89 ఏళ్లు మాత్రమే.

By:  Tupaki Desk   |   20 Dec 2023 5:06 AM GMT
దెబ్బకు అడ్వాణీ ఇంటికి వచ్చి ఆహ్వానపత్రాలు చేతిలో పెట్టారు
X

అయోధ్యలో రామాలయం అన్న మాట ఇప్పుడు ఇంత గొప్పగా మాట్లాడుకోవటమే కాదు.. ఏకంగా రామాలయాన్ని అంగరంగ వైభవంగా నిర్మించి.. మరో నెల వ్యవధిలో భారీఎత్తున ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. దీనంతటికి కారణం ఎవరన్న విషయానికి వస్తే.. అందరికి గుర్తుకు వచ్చే రెండు పేర్లలో ఒకటి బీజేపీ కురవ్రద్ధుడు లాల్ క్రిష్న అడ్వానీ కాగా.. మరొకరు మురళీ మనోహర్ జోషి. ఇప్పుడు వీరిద్దరిలో అడ్వాణీకి 96 ఏళ్లు అయితే.. మురళీమనోహర్ జోషికి మాత్రం 89 ఏళ్లు మాత్రమే. అడ్వాణీతో పోలిస్తే.. మురళీమనోహర్ జోషి మాంచి యంగ్ గా ఉన్నట్లే.

ఇదిలా ఉంటే.. అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ఘనంగాప్రారంభిస్తున్న వేళ.. ఈ ఇద్దరు ప్రముఖులకు మాత్రం రామాలయ ఆహ్వాన పత్రాలు ఇవ్వకపోగా.. ఈ ఇద్దరిని రావొద్దని.. ఆ రోజున రద్దీ ఎక్కువగా ఉంటుందని.. వారి వయసును ప్రాతిపదికగా తీసుకొని తాము వారిని రామాలయ ప్రారంభ రోజున రాకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ట్విస్టు ఏమంటే.. 89 ఏళ్ల మురళీ మనోహర్ జోషిని వద్దన్న బీజేపీ అధినాయకత్వం.. మాజీ ప్రధానిగా వ్యవహరించిన దేవగౌడ వయసు 90ప్లస్ కాగా.. ఆయన్ను దేవాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించటం తెలిసిందే.

రామాలయ ట్రస్టు వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అడ్వాణీ.. మురళీ మనోహర్ జోషి లాంటి వారిని ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కూడా అందించకపోవటం ఏమిటన్న ప్రశ్నలు అంతకంతకూ పెరగటమే కాదు.. సోషల్ మీడియా సాక్షిగా మోడీ పరివారాన్ని తిట్టి పోస్తున్నారు. అడ్వాణీ పోకస్ కాకుండా ఉండేందుకు ఇలాంటి డ్రామా ఆడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా సాధారణ ప్రజల ఆగ్రహాన్ని రుచి చూసిన రామాలయ ట్రస్టు ప్రతినిధులు.. ఎట్టకేలకు తమ మనసును మార్చుకున్నారు. ఆహ్వానపత్రికల్ని యుద్ధ ప్రాతిపదికన చేతపట్టి.. వారి ఇళ్లకు వెళ్లటమే కాదు.. వారి చేతుల్లో రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానపత్రాల్ని అందజేశారు. దీంతో.. ఆ ఇద్దరు ప్రముఖులు స్పందిస్తూ.. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

ఇదంతా చూస్తే.. సాదాసీదా ప్రజలు కానీ తిట్టిపోయకుంటే.. అడ్వాణీ.. మురళీ మనోహర్ జోషీలకు తాజాగా అందించిన ఆహ్వానపత్రిక అందేది కాదని మాత్రం చెప్పక తప్పదు. మొత్తంగా సామాన్య ప్రజల పవర్.. వారి నిరసన పోస్టులకు ఎవరైనా సరే.. దిగి రావాలన్న మాట మరోసారి నిజమని తేలిన పరిస్థితి. నిజానికి అయోధ్య రామమందిర నిర్మాణం వరకు కీలక భూమిక పోషించింది ఎవరన్న ప్రశ్నకు అడ్వాణీ.. మురళీ మనోహర్ జోషి పేర్లనే పలువురు ప్రస్తావిస్తుంటారు. అలాంటి వారిని రామాలయ ప్రారంభ రోజున ఎత్తేసే సాహసం చూస్తే.. మోడీ రాజ్యమా? మజాకానా? అన్న బావన కలుగక మానదు. అయితే.. ఇలాంటి పరిణామాలకు చూసి మరీ నెత్తి మీద మొట్టికాయలు వేసే తీరు చూస్తే.. సోషల్ మీడియానా మజానాకా? అన్న భావన కలుగక మానదు.