Begin typing your search above and press return to search.

ముంచి లేపింది... దుబాయ్ పై ప్రకృతి ప్రకోపం అందుకేనా?

ఇందులో భాగంగా... భారత్‌ నుంచి దుబాయ్‌ కు వెళ్లే 15, దుబాయ్‌ నుంచి భారత్‌ కు వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

By:  Tupaki Desk   |   18 April 2024 4:02 AM GMT
ముంచి లేపింది... దుబాయ్  పై ప్రకృతి ప్రకోపం అందుకేనా?
X

ఎడారులకు నిలయమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ను భారీ వర్షాలు పలకరించాయి. అక్కడ కురిసిన కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. ఫలితంగా... నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయంలో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌ వేపై భారీగా నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ - దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి.

ఇందులో భాగంగా... భారత్‌ నుంచి దుబాయ్‌ కు వెళ్లే 15, దుబాయ్‌ నుంచి భారత్‌ కు వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత వేగంగా ఎయిర్‌ పోర్టు లో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు! వాస్తవానికి దేశ సరాసరి సగటు వర్షపాతం 94.7 మి.మీ. కాగా.. 24 గంటల వ్యవధిలో 142 మి.మీ. వర్షం కురవడం గమనార్హం.

అంటే... ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం ఒక్కరోజులోనే నమోదైందన్నమాట. ఇదే విషయం సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇలా భారీ వర్షాలు ముంచెత్తడానికి గల కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఎడారి దేశమైన దుబాయ్ లో 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం సర్వసాదారణమని చెబుతుంటారు! పైగా ఏడాది మొత్తం మీద 150 మి.మీ.కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది.. అలాంటి చోట ఒక్కరోజులోనే ఏడాదిన్నరలో కురిసే వర్షం కురవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రకృతిని కంట్రోల్ చేయాలని.. ప్రకృతిని ఆడించాలని దుబాయ్ భావించడమే దీనికి కారణం అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

అవును... సాధారణంగా దుబాయ్ లో వర్షం పడటం అరుదు. అయితే.. రసాయనాలతో మేఘాలను కరిగించి వర్షం కురిపించుకునే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ వల్లే ఈస్థాయిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ ప్రమేయం సరికాదంటున్నారు. ప్రకృతిని తనపని తాను చేసుకోనివ్వాలని గుర్తుచేస్తున్నారు!