Begin typing your search above and press return to search.

'మతం ఏమిటో అడిగి'... కన్నీటి పర్యాంతమైన బితాన్ భార్య!

తాజాగా కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంటల జీవితాలను కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేశాయి.

By:  Tupaki Desk   |   23 April 2025 11:14 PM IST
మతం ఏమిటో అడిగి... కన్నీటి పర్యాంతమైన బితాన్ భార్య!
X

జమ్మూకశ్మీర్ లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సమయంలో మహిళలను, చిన్నారులను వదిలిపెట్టి.. పురుషులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో తమ కళ్లెదుటే తమ వారిని కోల్పోయిన మహిళలు చెబుతున్న విషయాలు భావోద్వేగానికి గురిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాధ. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బితాన్ భార్య తన కళ్లముందే జరిగిన ఘోరాన్ని వివరించారు!

అవును... తాజాగా కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి హనీమూన్ కోసం వెళ్లిన కొత్త జంటల జీవితాలను కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేశాయి. ఇదే సమయంలో స్వదేశంలోని ప్రకృతి అందాలను వీక్షించాలని వచ్చిన ఎన్నారై కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలోనే బలైనవారిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బితాన్ అధికారి ఒకరు.

అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడిన బితాన్.. టీసీఎస్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 8న భార్య, కుమారుడు (3) తో కలిసి స్వదేశానికి వచ్చి, గతవారం వెకేషన్ కని శ్రీనగర్ కు వెళ్లారు. ఈ ఘటనపై తాజాగా స్పందించిన బితాన్ భార్య సొహిని.. తాము లాన్ పై కూర్చొని ఉండగా.. సైనిక దుస్తుల్లో కొంతమంది తమ వద్దకు వచ్చారని తెలిపారు.

ఈ సమయంలో... "మీరు హిందువునా? ముస్లింనా?" అని తమను ప్రశ్నించారని.. దీంతో వారు ఉగ్రవాదులనే విషయం తమకు అర్ధమైందని తెలిపారు. ఆ సమయంలో తాము భయంతో వణికిపోగా.. ఎటూ కదలడానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. అనంతరం తన భర్తపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని అమె తెలిపారు.

ఆ సమయంలో తాను కళ్లు మూసి తెరిచే లోపు తన భర్త కుప్పకూలిపోయి ఉన్నారని.. తాము గురువారమే అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి ఉండగా, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని ఆమె కన్నీటి పర్యంతమవుతూ మీడియా ముందు మాట్లాడారు.