Begin typing your search above and press return to search.

దేవేగౌడను ఇంట్లో కూర్చోబెట్టిన బీజేపీ

ఇక బీజేపీకి కర్ణాటకలో 60 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ బలం ఉంటేనే జేడీఈస్ కి ఈ సీటు దక్కేది.

By:  Satya P   |   10 Jun 2026 8:15 AM IST
దేవేగౌడను ఇంట్లో కూర్చోబెట్టిన బీజేపీ
X

దేవేగౌడ. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. అంతే కాదు 1996లో కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు యునైటెడ్ ఫ్రంట్ తరఫున అనూహ్యంగా ప్రధాని రేసులోకి దూసుకుని వచ్చి పదకొండు నెలల పాటు దేశాన్ని ఏలిన వారు. ఇక ఆరు సార్లు లోక్ సభకు నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. అసెంబ్లీకి కూడా పలు మార్లు గెలిచారు. గత పుష్కర కాలంగా దేవేగౌడ రాజ్యసభ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన పదవీ కాలం పూర్తి అయింది. కర్ణాటక నుంచి మరోమారు ఆయనకు గెలిచేందుకు బీజేపీ సహకారం కావాలి. అక్కడ నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే అందులో సంఖ్యాబలం ప్రకారం మూడు కాంగ్రెస్ కి దక్కుతాయి. ఒకటి బీజేపీకి లభిస్తుంది. బీజేపీతో పొత్తులో ఉంటూ ఎన్డీయేలో భాగంగా ఉన్న జేడీఎస్ ఈ సీటు ఆశించింది పెద్దాయనను మరోసారి రాజ్యసభకు పంపించాలని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ తమ పార్టీకి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజుని ఎంపిక చేసి దేవేగౌడకు భారీ షాక్ ఇచ్చేసింది.

ఆశాభంగంతో జేడీయూ :

ఇక బీజేపీకి కర్ణాటకలో 60 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ బలం ఉంటేనే జేడీఈస్ కి ఈ సీటు దక్కేది. కానీ బీజేపీ మాత్రం పెద్దాయనను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పకనే చెప్పేసింది. ఇక దేవేగౌడ వయసు చూస్తే 93 ఏళ్ళు. అయినా ఈ ఏజ్ లోనూ ఆయన చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మరో దఫా పార్లమెంట్ కి వెళ్ళాలని కోరికను వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన వంటి దిగ్గజ నేత పెద్దల సభలో ఉండాలని బీజేపీ నేతలు ఆలోచించలేదా అన్నది ఇక్కడ చర్చగా ఉంది. దాంతో ఆయనను వెనక్కి పెట్టారని అంటున్నారు.

కాంగ్రెస్ హాట్ కామెంట్స్ :

అత్త తిట్టింది అన్నది కాదు తోడి కోడలు దెప్పింది అని కోడలు బాధపడిందట. అలా ఉంది జేడీఎస్ పరిస్థితి. బీజేపీ నేతలు తమ అధినేతకు రాజ్యసభ సీటు నిరాకరించారు అన్న బాధ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వారి సెటైర్లు మరింతగా బాధ పెడుతున్నాయని అంటున్నారు. దేవేగౌడ కుమారుడు కుమారస్వామి కేంద్రంలో ఉక్కు మంత్రిగా ఉన్నారు. ఆయన తన తండ్రికి మరో మారు రాజ్యసభ సీటుని ఖరారు చేయించుకోలేకపోయారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో అని మిన్నకుండిపోయారు అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఇక దేవేగౌడ అంటే కర్ణాటకలో పెద్దాయనగా ఉన్నారని ఆయన్ని బీజేపీ అవమానించిందని జేడీయూ నేతలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నారని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

లుకలుకలు స్టార్ట్ :

మరి బీజేపీ జేడీఎస్ ల మధ్య లుకలుకలు స్టార్ట్ అయినట్లేనా అన్న చర్చ కూడా సాగుతోంది. 2024 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలవబట్టే మొతం 28 లోక్ సభ సీట్లలో 25 పైగా గెలుచుకున్నాయి. అంతే కాదు రాజ్యసభలో అనేక బిల్లులకు జేడీఎస్ మద్దతు ఇచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలువరించడంలో కలసి పనిచేస్తున్నాయి. మరి ఇన్ని రకాలుగా జేడీఎస్ ని వాడుకుంటూ దేవేగౌడకు హ్యాండ్ ఇవ్వడం భావ్యమేనా అన్నది కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శ. బీజేపీ అయితే దీనికి ఏమీ జవాబు చెప్పడం లేదు కానీ జేడీయూలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ రోజు కాకపోయినా ఏదో నాటికి అది బాహాటం అయితే కర్ణాటకలో బీజేపీకి ఇబ్బందే అని అంటున్నారు. 2028 లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. జేడీఎస్ అయితే పొత్తులు మార్చడం అలవాటు అయిన పార్టీయే. దాంతో బీజేపీ పట్ల తమకు ఉన్న అసంతృప్తిని సరైన సమయంలో వ్యక్తం చేస్తుందా అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.