Begin typing your search above and press return to search.

బూడిదైన హవాయి స్వర్గధామం... ఎటు చూసినా కాలిన శవాలే!

వివరాళ్లోకి వెళ్తే... హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలో గల లహైనా పట్టణంలో మొదలైన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 12:41 PM GMT
బూడిదైన హవాయి స్వర్గధామం... ఎటు చూసినా కాలిన శవాలే!
X

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక నగరం ఇప్పుడు బూడిద దిబ్బగా మారింది. సుమారు 12వేల మంది నివాసముంటున్న పర్యాటక నగరం తగలబడిపోయింది. ఇప్పుడు ఆ టూరిస్ట్ సిటీలో ఎటు చూసినా కాలిన శవాలు, బూడిదైన భవనాలే కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం... కార్చిచ్చు!

అవును... అమెరికాలో హవాయి దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు రగిలింది. పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి విపత్తు వల్ల ఇప్పటివరకూ 67 మంది బలైపోయారు. ఆస్తినష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు ఇదని అధికారులు చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలో గల లహైనా పట్టణంలో మొదలైన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చుకి హరికేన్‌ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు తోడవ్వడంతో క్షణాల్లోనే పట్టణమంతా ఫైర్ విస్తరించింది. చూస్తుండగానే కళ్లముందరే అంతా తగులబడిపోయింది.

దీంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదవ్వగా... రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు నామరూపాల్లేకుండా కాలిపోయాయి.

ఈ కార్చిచ్చు కారణంగా... వందల సంఖ్యలో పక్షులు, జంతువులు మంటల్లో కాలిపోయాయి. ఇదే సమయంలో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు.

అయితే ఈ స్థాయిలో ప్రాణనష్టం కలగడానికి అధికారుల నిర్లక్ష్యం కారణం అని ఆరోపిస్తున్నారు. మంటలు నివాసాల సమీపానికి చేరేముందు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్‌ ఎలాంటి వార్నింగ్‌ సైరన్లు మోగించలేదని అంటున్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అంటున్నారు.