Begin typing your search above and press return to search.

రౌడీలతో నన్ను చంపించాలనుకున్నాడు..స్టార్ క్రికెటర్ భార్య సంచలన ఆరోపణ

ఏడెనిమిదేళ్లుగా విడిగా ఉంటూ ఉన్నా.. కోర్టులో కేసు తీర్పు వచ్చినా.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు మాత్ర మానలేదు.

By:  Tupaki Desk   |   5 July 2025 12:48 PM IST
రౌడీలతో నన్ను చంపించాలనుకున్నాడు..స్టార్ క్రికెటర్ భార్య సంచలన ఆరోపణ
X

ఏడెనిమిదేళ్లుగా విడిగా ఉంటూ ఉన్నా.. కోర్టులో కేసు తీర్పు వచ్చినా.. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు మాత్ర మానలేదు. గతంలోనే స్టార్ క్రికెటర్ కుటుంబం తీవ్రంగా హింసించిందని, అతడి సోదరుడు తనను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు చేసిన ఆమె.. ఇప్పుడు ఏకంగా హత్య ఆరోపణలు చేస్తోంది. తన భర్తకు అసలు వ్యక్తిత్వం లేదని.. క్రూరంగా ప్రవర్తించాడని తెలిపింది.

చూస్తూ ఉంటే.. స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కుటుంబ వివాదం మరింత రచ్చకెక్కేలా ఉంది. 2018లో షమీపై తీవ్ర ఆరోపణలతో ఆయన భార్య హసీన్ జహాన్ మీడియాకెక్కింది. అప్పటినుంచి వీరి మధ్య వివాదం నడుస్తోంది. షమీపై కోర్టులో కేసు వేయగా.. నెలకు జహాన్ కు రూ.లక్షన్నర, కూతురుకు రూ.2.5 లక్షలు చొప్పున భరణం ఇవ్వాలని ఇటీవల కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే జహాన్ ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

2018 నుంచి కోర్టు కేసు నడుస్తున్న సంగతి గుర్తుచేస్తూ.. షమీని విలువలు లేని వ్యక్తిగా నిందించింది. దురాశ, క్రూర మనస్తత్వం కారణంగా సొంత కుటుంబాన్నే నాశనం చేశావని తప్పుబట్టింది. తమను చంపడానికి, పరువు తీసి వేధించడానికి, ఓడించడానికి చాలామంది నేరగాళ్లకు డబ్బులిచ్చాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

అంతేకాదు.. షమీని స్త్రీ లోలుడిగా పేర్కొంది. నేరగాళ్లు, వేశ్యలకు షమీ ఖర్చు చేసిన డబ్బును.. కుమార్తె చదువుకు వెచ్చించి ఉంటే, మన భవిష్యత్ ఎంతో బాగుండేదని తెలిపింది.

తనకు దేవుడు ధైర్యం, సహనం ఇచ్చాడని.. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని జహాన్ తెలిపింది. ఇంకా పోరాటం చేస్తానని.. నువ్వు ఎందరు నేరగాళ్లతో చేతులు కలిపినా నన్ను ఏమీ చేయలేకపోయావని కూడా పేర్కొంది. ఏదో ఒకరోజు నీకు కూడా కష్ట కాలం మొదలవుతుందని.. ఇప్పుడు అండగా ఉన్నవాళ్లే అప్పుడు తరిమేస్తారని నిందించింది.

2014లో షమీ-హసీన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు. కానీ, కొన్నేళ్లకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 2018లో షమీపై ఆమె కేసు పెట్టింది. ఇటీవలే తీర్పు వచ్చింది. కాగా, షమీ కుమార్తె అతడితోనే ఉంటున్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. లేదా తరచూ తండ్రి దగ్గరకు వస్తోందని సమాచారం. జహాన్ చేసిన ఆరోపణలు కూడా అంత నమ్మదగ్గవిగా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.