Begin typing your search above and press return to search.

గురు పూర్ణిమ రోజు గురువుని చంపిన స్టూడెంట్స్.. కారణం హెయిర్ కట్!

అవును... హర్యానాలోని హిసార్‌ లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌ ను ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు కత్తితో పొడిచి చంపారనే విషయం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   11 July 2025 1:37 PM IST
గురు పూర్ణిమ రోజు గురువుని చంపిన స్టూడెంట్స్.. కారణం హెయిర్ కట్!
X

హిందూ సంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనదని చెబుతారు. ఇక గురుపూర్ణిమ, గురువారం కలిసివస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదని అంటారు. అలా అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈనెల 10వ తేదీన రాగా.. అదే రోజు గురువును హత్య చేశారు ఇద్దరు మైనర్ విద్యార్థులు. అందుకు గల కారణం మరింత షాకింగ్ గా ఉండటం గమనార్హం.

అవును... హర్యానాలోని హిసార్‌ లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌ ను ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు కత్తితో పొడిచి చంపారనే విషయం తెరపైకి వచ్చింది. హెయిర్ కట్ చేయించుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని కోరడమే ప్రిన్సిపాల్ చేసిన నేరంగా చెబుతున్నారు! అనంతరం మైనర్లు అయిన విద్యార్థులు అతనిని కత్తితో పలుసార్లు పొడిచి చంపారని అంటున్నారు. దీమో... రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే.. హిసార్‌ లోని బాస్ బాద్షాపూర్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ జగ్బీర్ సింగ్ (50) గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కత్తిపోట్లకు గురయ్యారు! ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు! ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా తీవ్రకలం రేపింది. మరోవైపు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసుల బృందం పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా స్పందించిన హన్సి పోలీసు సూపరింటెండెంట్ అమిత్ యశ్వర్ధన్.. విద్యార్థులను హెయిర్ కట్ చేయించుకోవాలని, సరిగ్గా దుస్తులు ధరించాలని, పాఠశాల నియమాలు పాటించాలని ప్రిన్సిపాల్ కోరినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని.. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తొందని అన్నారు!

ఇదే సమయంలో... ఈ పనికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులు మైనర్లేనని, వారిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని యశ్వర్ధన్ అన్నారు. పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, వివరణాత్మక దర్యాప్తు తర్వాతే ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు!