ఇలాంటి పెళ్లి గురించి ఎప్పుడూ విని ఉండరు
ఈ వార్త చదివే ముందు ఒక విషయం మాత్రం నిజం. ఈ తరహాలో ఒకే కుటుంబంలో టోకుగా పెళ్లిళ్లు జరిగి ఉండవు.
By: Tupaki Desk | 22 April 2025 1:00 PM ISTఈ వార్త చదివే ముందు ఒక విషయం మాత్రం నిజం. ఈ తరహాలో ఒకే కుటుంబంలో టోకుగా పెళ్లిళ్లు జరిగి ఉండవు. రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. ఈ వార్త చదివిన తర్వాత ఈ అన్నదమ్ముల కుటుంబాల్లో జరిగిన పెళ్లిళ్ల ముచ్చట మిమ్మల్ని గుర్తుంచుకునేలా చేస్తుందన్నది మాత్రం నిజం. ఇంతకూ విషయం ఏమంటే.. హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లి చేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.
పెళ్లిళ్లను గ్రాండ్ గా చేయటం.. దూర ప్రాంతాలను ఎంపిక చేసుకొని పెళ్లిళ్లు చేయటం చూశాం. అందుకు భిన్నంగా కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేలా.. ఒకేసారి తమ కుటుంబాల్లోని పిల్లలందరికి పెళ్లిళ్లు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. సమయాన్ని ఆదా చేయటం.. ఖర్చుల్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఈ తరహా పెళ్లిళ్లు చేసినట్లుగా చెబుతున్నారు. హర్యానాలోని హిసార్ జిల్లా గవాద్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ పిల్లలందరికి ఈ నెల 18, 19 తేదీల్లో పెళ్లిళ్లు చేశారు.
కొడుకుల పెళ్లి ఏప్రిల్ 18న.. కుమార్తెల పెళ్లిళ్లు ఏప్రిల్ 19న నిర్వహించారు. నాలుగు వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆరుగురు అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్లు.. అల్లుళ్లుగా.. కోడళ్లుగా మారారు. తాము ఈ తరహా పెళ్లిళ్లకు ఓటు వేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాంటి పెళ్లిళ్లతో కుటుంబాల మధ్య సోదర భావం మరింత పెరుగుతుందని.. డబ్బులు.. సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయాల్ని వీలైనన్ని కుటుంబాల్ని అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. వాస్తవంలో అదంత తేలికైన విషయం కాదని చెప్పొచ్చు.
