Begin typing your search above and press return to search.

బిచ్చగాడి ఖాతాలో రూ.లక్షలు.. మరణం తర్వాత వెలుగులోకి

హరియాణలోని అంబాలా నగరంలో లేఖరాజ్ అనే వృద్ధ యాచకుడి మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 11:32 AM IST
బిచ్చగాడి ఖాతాలో రూ.లక్షలు.. మరణం తర్వాత వెలుగులోకి
X

పట్టణ రద్దీ వీధుల్లో చిరిగిన బట్టలు.. మూడు చక్రాల పాత సైకిల్‌పై తిరుగుతూ కనిపించే ఓ భిక్షగాడు.. అతడి జీవితం అంతా చేతిలో పాత్ర, కళ్లలో నీరసం, నోటిలో నుంచి ‘దానం చేయండి’ అనే మౌన విజ్ఞప్తి. కానీ దాని వెనుక మరో కథ దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. హరియాణలోని అంబాలా నగరంలో లేఖరాజ్ అనే వృద్ధ యాచకుడి మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

పదేళ్లుగా అంబాలా రైల్వే స్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద కనిపించే బిచ్చగాడు లేఖరాజ్.. స్థానికులకు సుపరిచితుడు. చిరిగిన దుస్తులు, నీరసించిన ముఖం, వెనుక ఒక చిన్న ఇనుప ట్రంక్ కట్టేసిన పాత సైకిల్ ఇదే అతడి ప్రపంచం. భక్తులు, ప్రయాణికులు వేసే చిల్లర అతడి ఆస్తి అనుకున్నారు. కానీ ఆ చిల్లరే అతడి సంపదగా మారిందని మరణం తర్వాతే తెలిసింది.

ఫిబ్రవరి 9న మరణం..

అనారోగ్యంతో బాధపడుతున్న లేఖరాజ్‌ను ఫిబ్రవరి 9వ తేదీ ‘వందేమాతరం దళ్‌’ అనే స్థానిక సామాజిక సంస్థ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజుల చికిత్స తర్వాత ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యులు లేని కారణంగా ఆ సంస్థ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత పోలీసుల సమక్షంలో అతడి సామాన్లు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.

బ్యాంక్ ఖాతాలో...

అతడి సైకిల్‌కు కట్టిన ఇనుప పెట్టెలో రూ.50,000 విలువైన రూ.500 నోట్ల కట్ట దొరికింది. అదీ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ తో.. అదనంగా రూ.16,120 నగదు ఉంది. అంతటితో ఆగలేదు. పెట్టెలో ఉన్న పాస్‌బుక్‌ను పరిశీలించగా.. ఖాతాలో రూ.3,32,000 జమగా ఉన్నట్టు తేలింది. అంటే భిక్షాటన ద్వారా కూడబెట్టిన డబ్బును క్రమంగా బ్యాంకులో జమ చేస్తూ వచ్చాడని స్పష్టమైంది. చిరిగిన బట్టల వెనుక ఇంత జాగ్రత్తగా పొదుపు చేసుకున్న ఆర్థిక క్రమశిక్షణ ఉందని ఎవరూ ఊహించలేదు. ఈ ఘటన ఒక ప్రశ్నను ముందుకు తెస్తోంది.. పేదరికం అంటే కేవలం చేతిలో డబ్బు లేకపోవడమేనా? లేక జీవనశైలి, మనసులోని భద్రతాభావం, భవిష్యత్తుపై భయం కలిసి సృష్టించే ఒక మానసిక స్థితినా?

సంపన్నులకు ఆయన ఇచ్చే మెసేజ్..

లేఖరాజ్ కథలో ఒక పాఠం ఉంది. ఆదాయం ఎంత చిన్నదైనా, పొదుపు అలవాటు ఉంటే అది కొండంత అవుతుందనే నిజం. లేఖరాజ్ ను సమాజం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్లముందే తిరిగిన ఓ మనిషి జీవితం గురించి మనం ఎంత తెలుసుకున్నాం? అతడు ఎందుకు కుటుంబం లేకుండా, ఆస్తి కూడబెట్టుకుని ఒంటరిగా జీవించాడు? మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ కథ.. యాచకుడి ఖాతాలోని లక్షల కంటే ఎక్కువగా మనసులను కదిలిస్తోంది. జీవితం ఎంత విచిత్రమో.. కనిపించేది ఒకటి, దాగి ఉండేది మరోటి అనే సత్యాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది.

లేఖరాజ్‌ కథలో మరో కోణం ఉంది. రోజూ ఆలయం ముందు కూర్చునే అతడిని చూసి చాలా మంది కనికరం చూపించి నాణేలు, నోట్లను చేతిలో పెట్టేవారు. కానీ అతడు ఆ డబ్బును ఖర్చు చేయడంలో కాకుండా, జాగ్రత్తగా దాచుకోవడంలోనే ఆసక్తి చూపించాడు. భవిష్యత్తు భయం, ఒంటరితనం, అనారోగ్యం.. ఇవన్నీ అతడిని పొదుపు వైపు మళ్లించినట్లు ఉంది. భిక్షాటన ద్వారా వచ్చిన చిన్నచిన్న మొత్తాలను కూడబెట్టి బ్యాంకులో జమ చేయడం అతడి ఆర్థిక చైతన్యాన్ని సూచిస్తోంది. ఇది సాధారణంగా ఊహించని విషయం.

డబ్బు ఉన్నా భిక్షగాడిగానే..

అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా ఎదురవుతోంది. అంత డబ్బు కూడబెట్టుకున్నప్పటికీ ఎందుకు అతడు అదే జీవనశైలిని కొనసాగించాడు? అవసరాల కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇది పేదరికం కంటే భద్రతా భావం కోసం చేసే పోరాటమేమో. ఒక రోజు భోజనం దొరకకపోతే ఏం చేయాలి అన్న ఆందోళన అతడిని డబ్బు తాకకుండా ఉంచిందేమో. సమాజం ఇచ్చిన సహాయం.. చివరకు అతడికే కాకుండా, అతడి మరణానంతరం సమాజానికే ఒక పాఠమై నిలిచింది. చిన్న మొత్తాలైనా పొదుపు చేయగలిగితే అది పెద్ద భద్రతగా మారుతుందని లేఖరాజ్‌ జీవితం చెబుతోంది.