పవన్ కల్యాణ్ ను వదలని వీణ.. ప్రశ్నల పరంపర
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చుట్టుకుంది.
By: Tupaki Desk | 21 March 2026 11:55 PM ISTరైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చుట్టుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ హర్ష వీణ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తూ మరో వీడియో విడుదల చేశారు. తన ఫిర్యాదుపై విచారణ జరుగుతుండగా, శ్రీధర్ జనసేన పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడాన్ని వీణ తప్పుబట్టారు. తనకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. పవన్ ను ప్రశ్నిస్తూ బాధిత మహిళ వీణ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ ను ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలు వీణ విడుదల చేసిన వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్ దృష్టిలో తనకు మాత్రమే విలువ లేదని ఇన్నాళ్లు అనుకున్నానని, ఇప్పుడు పవన్ ను కూడా ఆయన లెక్క చేయడం లేదని తనకు అనిపిస్తోందని వీణ ఆ వీడియోలో ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని పవన్ చెబుతున్నప్పటికీ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన కండువాలు కప్పుకుని బహిరంగంగా తిరుగుతున్నాడని, ఎమ్మెల్యే శ్రీధర్ అలా తిరుగుతున్నాడంటే ఆయన తప్పు చేయలేదని పవన్ సర్టిఫికేట్ ఇచ్చారా? అంటూ వీణ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే శ్రీధర్, పంచాయతీ ఉద్యోగిణి వీణ మధ్య నెలకొన్ని వివాదంపై గత రెండు నెలలుగా రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇరువురు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వీణ చేసిన ఫిర్యాదుతో జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడంతోపాటు, వీణ ఆరోపణలపై త్రీమెన్ కమిటీని వేస్తున్నట్లు జనసేన పార్టీ గతంలో ప్రకటించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై త్రీమెన్ కమిటీ విచారణ జరిపింది. ఇందులో ఏం తేలిందన్న విషయమై పార్టీ నుంచి అధికారికంగా బయటకు రాలేదు.
కానీ, ఎమ్మెల్యే శ్రీధర్ జనసేన కార్యక్రమాలకు హాజరవుతున్నారని బాధిత మహిళ వీణ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయకుండా, తన ఆరోపణలపై వేసిన కమిటీ ఏం తేల్చిందన్న విషయాన్ని చెప్పకుండా శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలలో భాగం చేయడంపై బాధితురాలు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను నిలదీస్తూ వీణ వీడియో విడుదల చేశారు. ఇప్పటివరకు తనకు జరిగిన అన్యాయంపైన ఎమ్మెల్యే శ్రీధర్ పైనే వీణ వీడియోలు విడుదల చేసేవారు. కానీ, తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఆమె వీడియో విడుదల చేయడం సంచలనంగా మారిందని అంటున్నారు.
