Begin typing your search above and press return to search.

ఇదేం సిత్రం హరీశా? మనం ఎప్పుడైనా పీపీటీకి ఛాన్సు ఇచ్చామా?

దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అధికార పక్షం సత్య దూరమైన ప్రజంటేషన్ ఇచ్చిందని.. పీపీటీ కోసం తమకు ఛాన్సు ఇస్తే.. వాస్తవాల్ని వివరిస్తామని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 3:30 PM GMT
ఇదేం సిత్రం హరీశా? మనం ఎప్పుడైనా పీపీటీకి ఛాన్సు ఇచ్చామా?
X

అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు మైకు సైతం ఇచ్చే విషయం గులాబీ పార్టీ ఎలా వ్యవహరించిందన్న విషయం తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న వేళలో విపక్షాలు నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేయటం.. తమకు నచ్చిన సభ్యులు అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చూడటం లాంటి పనులెన్నో చేసిన వైనాన్ని గులాబీ నేతలు మర్చిపోయినా.. తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదనే చెప్పాలి.

అలాంటిది సభలో ప్రధాన ప్రతిపక్షంగా తమకు ఏయే అవకాశాలు కల్పించాలన్న విషయాలు మాజీ మంత్రి హరీశ్ నోటి నుంచి వస్తుంటే ఎన్నెన్ని సిత్రాలు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఈ రోజు (సోమవారం) క్రిష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రేవంత్ సర్కార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పీపీటీ ద్వారా క్రిష్ణా ప్రాజెక్టుల విషయంపై పలు వివరాల్ని వెల్లడించారు.

ఉత్తమ్ పీపీటీ అనంతరం మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. తమకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేలా అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. ఇందుకు స్పీకర్ నో చెప్పారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అధికార పక్షం సత్య దూరమైన ప్రజంటేషన్ ఇచ్చిందని.. పీపీటీ కోసం తమకు ఛాన్సు ఇస్తే.. వాస్తవాల్ని వివరిస్తామని పేర్కొన్నారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవటం బ్యాడ్ లక్ గా పేర్కొన్నారు.

ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు.. బీఆర్ఎస్ విజయంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి తాజా ప్రకటన చేశారని.. తప్పుల్ని సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందుకే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారన్న ఆయన.. "ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వినలేదా? ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా మేమే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా? కేసీఆర్.. హరీశ్ రావు.. జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లాను మోసం చేశారు. బీఆర్ఎస్ పుణ్యమా అని వ్యవసాయం సంగతి తర్వాత తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పటం లేదు. జగదీశ్ రెడ్డికి ముఖం చెల్లకే ఈ రోజు సభకు రాలేదు. క్రిష్ణా జిల్లాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు కోరాలి. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలి" అని మండిపడ్డారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హరీశ్.. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను ముక్కు నేలకు రాసి సభకు రావాలనటం సరికాదని.. అందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అయితే.. ఉత్తమ్ ఇచ్చిన పీపీటీ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ధీటుగా హరీశ్ సమాధానం ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో తమకు పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలని హరీశ్ ఎలా అడుగుతారని.. తొమ్మిదిన్నరేళ్ల ప్రభుత్వంలో ఏరోజు అయినా విపక్షాలకు ఆయన కోరుతున్నట్లుగా అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు.