Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా హరీశ్.. తేలిపోతున్న కేటీఆర్.. గులాబీ బాస్ కు కొత్త కష్టం

టైం బాగున్నప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరు ఉంటారు

By:  Tupaki Desk   |   16 Feb 2024 6:30 AM GMT
హాట్ టాపిక్ గా హరీశ్.. తేలిపోతున్న కేటీఆర్.. గులాబీ బాస్ కు కొత్త కష్టం
X

టైం బాగున్నప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరు ఉంటారు. కానీ.. సీన్ రివర్సు అయ్యాక మాత్రమే వారి వాస్తవిక బలం ఏమిటన్నది అర్థం కావటమే కాదు.. తమ లోపాలు అర్థమయ్యేలా చేస్తుంటాయి. చేతిలో అధికారం ఉన్న వేళ.. తమ బలాన్ని చూపిస్తూ వాస్తవాన్ని నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ.. పవర్ చేజారిన తర్వాత ఆటోమేటిక్ గా వారి కంట్రోల్ లో విషయాలు ఉండని పరిస్థితి నెలకొంటుంది.

ఇదే విషయం విపక్ష బీఆర్ఎస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న వేళలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ ను తిరుగులేని నేతగా చూపించే వారు. చివరకు హరీశ్ సైతం ఆయన అధిక్యతకు తగ్గాల్సిన పరిస్థితి. మనసులో ఉన్నది అలానే ఉంచేసుకొని.. కేటీఆర్ తో నడవక తప్పని పరిస్థితి హరీశ్ కు ఉండేది. అలాంటి ఆయనకు పార్టీ ప్రతిఫక్షంగా మారిన తర్వాత.. ఇష్యూస్ ను డీల్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో.. గులాబీ పార్టీలో ఎవరి బలం ఏమిటి? ఎవరి బలహీనత ఏమిటన్న విషయంపై మరింత క్లారిటీ వచ్చిన పరిస్థితి.

అధికార కాంగ్రెస్ పార్టీతోనే.. ప్రభుత్వాధినేతగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కారణంగా ఇబ్బంది పడుతున్న కేసీఆర్ కు సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నట్లు చెబుతున్నారు. విపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావటానికి ఇంట్రస్టు లేని కేసీఆర్ కు.. హరీశ్ రూపంలో మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే అవసరమైన సమయాల్లో మాట్లాడని కేటీఆర్.. అనవసర ఇష్యూస్ లో మాత్రం మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు.

కీలకమైన కాళేశ్వరంప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్న వేళ.. హరీశ్ ఒంటరిపోరు చేయాల్సి వచ్చింది. ఇరిగేషన్ మంత్రిగా వ్యవహరించిన అనుభవంతో హరీశ్ మాట్లాడుతున్నారని సమర్థించుకున్నా.. కేటీఆర్ తన వంతు కర్తవ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయని తీరును గులాబీ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. హరీశ్ ను తమ పార్టీలోకి చేర్చుకుంటామని.. మంత్రిగా చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయటం.. తాజాగా హరీశ్ ను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎంపిక చేయమని అదే కాంగ్రెస్ నేతలు మరోసారి మాట్లాడటం లాంటివి కేసీఆర్ కు ఇబ్బందిగా మారుతున్నట్లు చెబుతున్నారు.

కాళేశ్వరం ఇష్యూ మీద చర్చలో అసెంబ్లీలో ఒంటరిపోరు చేసిన హరీశ్ ను.. సోషల్ మీడియాలో కేటీఆర్ అభినందించిన వైనాన్ని తప్పుపడుతున్నారు. ఒంటరిపోరు చేశారని కేటీఆరే చెబుతున్నారు. మరి.. ఆయనేం చేసినట్లు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత పార్టీ ముఖంగా మారిన కేటీఆర్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తేలిపోతున్నట్లు చెబుతున్నారు. మొన్నటికి మొన్న సభ నుంచి బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్దకు వెళ్లే వేళలో.. మార్షల్స్ అడ్డుకున్న సందర్భంలోనూ హరీశ్ గట్టిగా నిలదీయగా.. కేటీఆర్ పక్కనే నిలబడి ఉన్నారే తప్పించి.. పెద్దగా మాట్లాడింది లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ బీఆర్ఎస్ లో హరీశ్ వెలిగిపోతుంటే.. కేటీఆర్ తేలిపోతున్న పరిస్థితి. ఇప్పటికే చేతినుంచి అధికారం చేజారి ఇబ్బంది పడుతున్న కేసీఆర్ కు పార్టీలో హరీశ్ అంతకంతకూ ప్రాధాన్యత పెరుగుతున్న వైనం జీర్ణించుకోలేని రీతిలో మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.