Begin typing your search above and press return to search.

డీజీపీ బదిలీ...టీడీపీ సగం సక్సెస్ !

ఇదిలా ఉంటే ఏపీకి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. దీంతో ఏపీలో నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రాజకీయం కొత్త మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   6 May 2024 2:55 PM GMT
డీజీపీ బదిలీ...టీడీపీ సగం సక్సెస్ !
X

కీలకమైన టైం లో ఏపీ ఎన్నికల రాజకీయం ఉంది. మరో వారం రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంది. ఈ టైం లో సడెన్ గా ఏపీ డీజీపీని బదిలీ చేశారు. గత ఏడాదిన్నరగా డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి కొత్త డీజీపీని ఈసీ నియమించింది. రాజేంద్రనాధ్ రెడ్డికి ఎన్నికల బాధ్యతలు ఏవీ అప్పగించరాదు అని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఏపీకి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. దీంతో ఏపీలో నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఏపీలో డీజీపీని సీఎస్ ని బదిలీ చేయాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది. నిజానికి చూస్తే ఎన్నికల ముందు ఇది సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియగానే చూడాలి.

అప్పటి వరకూ ఉన్న ప్రభుత్వం నియమించిన అధికారులు కీలక స్థానంలో ఉంటే వారు ఎంతో కొంత గత ప్రభుత్వానికి ఫేవర్ గా ఉంటారు అన్న ఆలోచనలతో విపక్షాలు ఈ బదిలీ డిమాండ్లు చేస్తూ ఉంటాయి. ఈసీ కూడా నిష్పాక్షికంగా ఎన్నికలు అన్న ఆలోచనతోనే వ్యవహరిస్తుంది. దాంతో విపక్షాల డిమాండ్లలో సహేతుకత ఏమైనా ఉంటే కచ్చితంగా దానిని పరిగణనలోకి తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన యాభై రోజులు పై దాటుతోంది. ఇప్పటికే కీలక స్థానాలలో బదిలీలు జరిగాయి, సరిగ్గా పోలింగ్ కి ముందు డీజీపీ బదిలీ అన్నది చూస్తే దేనికి సంకేతం అన్న చర్చ వస్తోంది. డీజీపీతో పాటు సీఎస్ ని కూడా బదిలీ చేసి తీరాలన్నది టీడీపీ పట్టు.

అదే సమయంలో కొత్త డీజీపీగా తాము అనుకుంటున్న వారు రావాలని కూడా టీడీపీ ఆశించింది అని ప్రచారం సాగింది. కొత్త డీజీపీగా మాజీ ఐబీ సీనియర్ ఐఏఎస్ వెంకటేశ్వరరావుని నియమిస్తారని కూడా ఆశించింది. అయితే ఆయన ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. దాంతో కేవలం పాతిక రోజుల వ్యవధి కోసం డీజీపీని నియమించారు. పైగా కౌంటింగ్ ప్రక్రియ వచ్చే నెలలో ఉంది. అందుకే కొత్త డీజీపీ విషయంలో ఆయన పేరు పరిశీలించలేదు అని ప్రచారంలో ఉన్న మాట.

ఇక ద్వారకా తిరుమలరావు అనే మరో సీనియర్ ఐఏఎస్ పేరు కూడా వెళ్ళింది. కానీ ఆయనను కూడా పక్కన పెట్టారు. గతంలో బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన పేరును సిఫార్సూ చేస్తూ బదిలీలు కోరడంతో ఇది రాజకీయంగా అవుతుంది అని ఆలోచించారో ఏమో తెలియదు కానీ ఆయన పేరుని పరిగణనలోకి తీసుకోలేదు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే డీజీపీ బదిలీ విషయంలో టీడీపీ డిమాండ్ చేసి సాధించుకుంది అని అంటున్నారు. కానీ ఆ పార్టీ కోరుకున్న వారు అయితే కొత్త డీజీపీగా రాలేదు. అదే విధంగా సీఎస్ ని బదిలీ చేయాలని టీడీపీ డిమాండ్ అలాగే ఉంది. పోలింగ్ కి గట్టిగా వారం రోజులే టైమున్న వేళ ఆ డిమాండ్ ని ఈ టైం లో పట్టించుకుంటారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏది ఏమైనా కూడా ఇది సాధారణ బదిలీ అని ఒక వైపు అంటున్నా కీలక సమయం కావడంతో టీడీపీ డిమాండ్ పనిచేసి ఉండొచ్చు అన్న భావన అయితే కలుగుతోంది అంటున్నారు. చూడాలి మరి కొత్త డీజీపీ నియామకం తరువాత పర్యవసానాలు ఎలా ఉంటాయో ఏమిటి అన్నది. ఏపీలో ఇది ఒక ముఖ్య పరిణామం అని చెప్పక తప్పదని అంటున్నారు.