హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడా..? సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డాడా..?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై ఇటీవల మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు గులాబీ పార్టీని భారీ కుదుపునకు గురి చేశాయి.
By: Tupaki Desk | 5 Sept 2025 1:15 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై ఇటీవల మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు గులాబీ పార్టీని భారీ కుదుపునకు గురి చేశాయి. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కొండా సురేఖ తప్ప ఇప్పటి దాకా హరీష్ రావుపై సొంత పార్టీలో ఆరోపణలు గానీ విమర్శలు గానీ చేయలేదు. కానీ కవిత చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్పష్టత ఇచ్చినట్లేనా?
ప్రస్తుతం లండన్‌లో ఉన్న బీఆర్‌ఎస్ సీనియర్ తన్నీరు హరీష్ రావు, అక్కడ పార్టీ అనుబంధ సంఘ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారాయి. కవిత విమర్శల నేపథ్యంలో హరీష్ రావు స్పందించిన తీరుకు మరింత ప్రాధాన్యం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నాయకత్వం, పార్టీ నిర్ణయాధికారంపై హరీష్ చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచాయి.
కేసీఆర్ ఆధిపత్యంపై పునరుద్ఘాటన
“బీఆర్‌ఎస్‌లో కేసీఆరే సుప్రీం” అని మరోసారి అని చెప్పుకొచ్చారు. ఇది ఒకవైపు కేసీఆర్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుండగా, మరోవైపు పార్టీ లోపలి శక్తి సమీకరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో ఒక రాజకీయ సందేశంలా మారింది. పార్టీకి సంబంధించి ఏ విషయమైనా తుది నిర్ణయం కలిసే తీసుకుంటామని చెప్పడం ద్వారా తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పంపే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
హరీష్ రావు ప్రసంగంలో మరో అంశం కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్షాలపై దాడి చేసే ధోరణిలో ఉందని అభిప్రాయపడ్డారు. ఇది ఆయన బీఆర్‌ఎస్ తరపున మళ్లీ ప్రతిపక్ష పాత్రను బలంగా పోషించేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాన్ని ఇస్తోంది.
కవిత ఆరోపణలపై స్పందించని ట్రబుల్ షూటర్
హరీష్ రావును అక్కడి మీడియా కవిత ఆరోపణలపై ప్రశ్నించింది. కానీ ఆయన సమాధానం ఇవ్వకుండా, ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత మాట్లాడతానని చెప్పారు. ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక మౌనం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కవిత వ్యాఖ్యలు పార్టీ లోపలి వివాదాలకు దారితీయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో హరీష్ వెంటనే స్పందించకుండా సమయం తీసుకోవడం, తన జాగ్రత్త పూర్వక వైఖరిని సూచిస్తుంది.
రాబోయే పరిణామాలపై ఉత్కంఠ
హరీష్ రేపు భారత్‌కు తిరిగి రావడం, ఆ తరువాత జరగబోయే మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పబోతున్నాడనే దానిపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఆయన స్పష్టమైన సమాధానం ఇస్తారా? లేక మళ్లీ పార్టీ ఐక్యతను కాపాడే మాదిరిగానే సమతుల్య వ్యాఖ్యలకే పరిమితమవుతారా? అన్న సందేహాలువ వ్యక్తమవుతున్నాయి.
“కేసీఆర్ ఆధిపత్యం, కవిత ఆరోపణల ప్రభావం, బీఆర్‌ఎస్ భవిష్యత్తు దిశ – ఈ మూడు అంశాలు కలిపి ప్రతిబింబించే ప్రసంగమే హరీష్ రావు వ్యాఖ్యలు.”
ఆయన త్వరలో చేసే ప్రకటనలు పార్టీ అంతర్గత సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో అన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.
