Begin typing your search above and press return to search.

సభలో కాంగ్రెస్ మంత్రుల్ని ఆట ఆడుకున్నహరీశ్

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్ష అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది.

By:  Garuda Media   |   29 March 2026 10:00 AM IST
సభలో కాంగ్రెస్ మంత్రుల్ని ఆట ఆడుకున్నహరీశ్
X

సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్ష అధిక్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అందునా.. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపి.. బోలెడన్ని మరకలు అంటించుకున్న బీఆర్ఎస్ లాంటి పార్టీని.. తెలంగాణ అధికార పార్టీకి చెందిన మంత్రులు తమ మాటలతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. అయితే.. శనివారం తెలంగాణ అసెంబ్లీలో సీన్ రివర్సు అయ్యింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేని వేళ.. మాజీ మంత్రి హరీశ్ దూకుడుకు.. బ్రేకులు వేయలేని మంత్రుల పరిస్థితి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. హరీశ్ దూకుడు.. విమర్శల తీవ్రతకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

దీనికి తోడు.. మంత్రి పొంగులేటి మీద హరీశ్ రావు సంధించిన విమర్శలు.. ఆరోపణలు పదునుగా ఉండటం ఒక ఎత్తు అయితే.. అంతే దూకుడుగా సమాధానం చెప్పే విషయంలో సభలో ఉన్న సీనియర్ మంత్రుల నుంచి మిగిలిన అధికార పార్టీ సభ్యుల వరకు ఎవరూ సరైన రీతిలో రియాక్టు కాని పరిస్థితి. మొత్తంగా చూస్తే..హరీశ్ దెబ్బకు కాంగ్రెస్ మంత్రులు విలవిలలాడిన దుస్థితి.

ఇంతకూ.. అసెంబ్లీలో హరీశ్ ప్రస్తావించిన అంశాల్ని చూస్తే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతుందని..దీనిపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ సాగిస్తోందని.. అనుమతి పొందిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోందని గణంకాలతో సహా వివరించారు.

మంత్రి పొంగులేటిని ఇరుకున పెట్టే వాదనను కొనసాగించిన హరీశ్ రావు.. ‘‘గతంలోనే ఈ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని, అందుకు సంబంధించి మైనింగ్ శాఖ సుమారు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది.ఆ విషయాన్ని మర్చిపోయారా? ఆ జరిమానాను వసూలు చేయకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది’’ అని నిలదీశారు. తన వాదన తప్పా? ఒప్పా? అన్నది తేల్చేందుకు ప్రభుత్వం నిజాయితీగా ఉంటే.. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేసేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు.

తాను డిమాండ్ చేసిన హౌస్ కమిటీ వేస్తే.. వాస్తవాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతోనే.. కమిటీ వేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని మండిపడ్డారు హరీశ్. అంతేకాదు.. మంత్రి పొంగులేటి మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని క్షేత్రస్థాయిలో ఉన్న మైనింగ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని హరీశ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగటం సరికాదని.. దీనికి సీఎం సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.

తాను చేస్తున్న ఆరోపణలు.. విమర్శలకు దన్నుగా డాక్యుమెంట్లు.. నోటీసులను చూపిస్తూ మాట్లాడిన హరీశ్ కు కౌంటర్ ఇచ్చే విషయంలో మంత్రులు ఎవరూ సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో.. హరీశ్ రావు దూకుడును నిలువరించటం మంత్రులకు కష్టంగా మారింది. ఇదే విషయాన్ని హరీశ్ ప్రస్తావిస్తూ.. ఎద్దేవా చేసినట్లుగా వ్యాఖ్యలు చేవారు. ‘పొంగులేటిని కాపాడేందుకు ఇతర మంత్రులు ప్రయత్నిస్తున్నారు. తప్పు జరిగింది కాబట్టే సమర్థించుకోవటానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించారు.

మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ తో పాటు.. మైనింగ్ అంశంపై తీవ్రమైన ఆరోపణలు చేయటం.. దానికి సంబంధించిన పత్రాలుగా కొన్నింటిని చూపిస్తూ.. దాదాపు గంటన్నర పాటు హరీశ్ తన వాదనను వినిపించారు. ఆయనకు అడ్డు తగులుతూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పలువురు మంత్రులు. ఇదంతా జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ సభలో లేరు. దాదాపు గంటన్నర పాటు హరీశ్ వాదనకు.. సరైన రీతిలో సమర్థంగా అడ్డుకోలేని పరిస్థితి. దీంతో అధికారపక్షానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వేళలో సభలోకి అడుగు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్. సభలోకి వచ్చీ రాగానే పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం రేవంత్.. దాదాపు పది నిమిషాల పాటు విషయాన్ని అర్థం చేసుకొని.. ఈ అంశంపై తానే స్వయంగా రంగంలోకి దిగిన హరీశ్ వాదనకు చెక్ పెట్టటమే కాదు.. కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు.

పొంగులేటిపై హరీశ్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పటం కంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పదేళ్ల కాలంలో సాగిన అక్రమ మైనింగ్ జాబితాను చదవటం షురూ చేశారు. హరీశ్ రావు హౌస్ కమిటీ కోసం డిమాండ్ చేస్తున్న క్రమంలో.. సీఎం రేవంత్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన మైనింగ్ కంపెనీలపై కూడా సీబీసీఐడీ విచారణకు తక్షణం ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించటంతో ప్రతిపక్షంలో ఒక్కసారి కలకలం రేగింది. అప్పటివరకు మంత్రి పొంగులేటిని ఆత్మరక్షణలో పడేశామన్న ఆనందం ఒక్కసారి ఆవిరై.. హరీశ్ కారణంగా పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అంంశాలపై విచారణ ఎదుర్కొనే పరిస్థితి వారిని విస్తుపోయేలా చేసింది. ఈ సందర్భంగా అధికార.. విపక్ష నేతల మధ్య వాడీవేడీ వాదన జరిగినప్పటికి సీఎం రేవంత్ తనదైన వాదనతో స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించారు.