తెలంగాణా పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ హరీష్ ?
తెలంగాణా రాజకీయాలు ఇపుడు ముక్కోణం పోరుగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ కి రెండు ప్రధాన పక్షాలు ప్రత్యర్థులుగా ఉన్నాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 9:45 AM ISTతెలంగాణా రాజకీయాలు ఇపుడు ముక్కోణం పోరుగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ కి రెండు ప్రధాన పక్షాలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలం తెలంగాణాలో తక్కువగా ఉన్నా తీసివేయడానికి లేదు అన్నది ఒక విశ్లేషణ. ఇక గ్రౌండ్ లెవెల్ దాకా పాతుకుని పోయిన బీఆర్ ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీగా కేలక ప్రత్యర్ధి అనడం కూడా సబబు.
ఇలా రెండు పార్టీలు ఉండడం వల్ల 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎంతో అడ్వాంటేజ్ అయింది. అదే సీన్ 2028 ఎన్నికల్లో రిపీట్ అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే యాంటీ ఇంకెంబెన్సీ ఎక్కువగా ఉన్నా వ్యతిరేక ఓట్లు చీలి ఏదో కాడికి కాంగ్రెస్ అధికారానికి అవసరం అయ్యే సీట్లు సాధించుకుంటుందని విశ్లేషణలు ఉన్నాయి.
ఇక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసేది లేదు. సీఎం కుర్చీ మీదనే రెండు పార్టీలకు మోజు ఉంది. దాంతో త్రిముఖ పోరు కచ్చితంగా కాంగ్రెస్ కే లాభం అన్నది అర్ధమవుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఏదో ఒక పార్టీ బలంగా మారాలి. మరో పార్టీ బలహీనం కావాలి. అలా జరగాలీ అంటే ఒక పార్టీని వీక్ చేయాల్సిందే.
జాతీయ పార్టీగా కేంద్రంలో వరసగా మూడోసారి అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణా మీద గంపెడాశలు ఉన్నాయి. పైగా వీక్ కావడం అన్నది జరగనిది. ఇక 21 రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తున్న బీజేపీకి తెలంగాణా 22వ రాష్ట్రం కావాలన్న కోరిక బలంగా ఉంది.
దాంతో ఓడి విపక్షంలో ఉంటూ ఇబ్బందులో ఉన్న బీఆర్ఎస్ ని వీక్ చేయడమే సులువు అన్న చర్చ ఉంది. ఈ మధ్యనే కేసీఅర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ మీద సంచలన విమర్శలు చేశారు. కేసీఆర్ దేవుడు అన్నారు, చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కోటరీ కూడా ఏర్పడిందని కూడా నిందించారు. దాంతో బీఆర్ఎస్ లో రాజకీయ సంక్షోభం ఉంది అని ప్రచారం సాగుతోంది.
కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటి నుంచి ఒక రకమైన అసంతృప్తి ఉందని అంటున్నారు కవిత కూడా తన రాజకీయ వాటా తేల్చుకోవడానికే గళం విప్పారు అని అంటున్నారు. ఇక సొంత బిడ్డే ఈ విధంగా నిరసన గొంతుతో ముందుకు సాగితే మేనల్లుడు హరీష్ రావు మీదనే అందరి చూపూ ఉంది.
హరీష్ రావు అయితే తాను పార్టీకి కేసీఆర్ కి వీర విధేయుడిని అని చెబుతున్నారు. ఆయన తాను పార్టీ మారేది లేదని అంటున్నారు. అయితే పుకార్లు మాత్రం ఆగడం లేదు. బీజేపీ పెద్దలు ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చారని ఆయన కనుక బీజేపీలో చేరితే తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని ఒక గాసిప్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరు చేశారో తెలియదు కానీ ఇది వైరల్ గా మారుతోంది.
బీజేపీ ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే ఉంటే 2028 ఎన్నికల నాటికి గెలిచేది ఉండదని కమలనాథులకు తెలుసు అని అంటున్నారు. తమకు పోటీగా ఉన్న బీఆర్ఎస్ తగ్గిపోవాలి. తాము పెరగాలి. కాంగ్రెస్ ని ఢీ కొట్టే ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలన్నది బీజేపీ ఆలోచన అని అంటున్నారు. అపుడే ప్రజలు తమను కాంగ్రెస్ కి ఆల్టర్నేషన్ గా చూస్తారు అని భావిస్తున్నారు.
అది జరగాలీ అంటే బలమైన నాయకత్వం బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు జరగాలని అంటున్నారు. అందుకే చాలా కాలంగా బీజేపీ పెద్దల చూపు హరీష్ రావు మీద ఉందని అంటున్నారు. ఆయనకు ఓపెన్ ఆఫర్ నే ఇచ్చారు అని అంటున్నారు. మరి హరీష్ రావు అయితే మేనమామకు వీర విధేయుడిని అని చెబుతున్నారు.
రాజకీయాల్లో అయితే ఎ పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అంటున్నారు. దానో తెలంగాణాలో ఉన్న పాలిటిక్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసే ఆ గేమ్ చేంజర్ హరీష్ రావే అవుతారు అని ప్రచారం సాగుతోంది. ఆయన అటు నుంచి ఇటు వైపు వస్తే టోటల్ పిక్చర్ మారిపోతుంది అని అంటున్నారు.
మరి హరీష్ రావు విషయంలో పుకార్లుగా వినిపిస్తున్న మాటలు నిజమవుతాయా అంటే ప్రస్తుతానికి అయితే నో అనే అంటున్నారు. ఫ్యూచర్ అన్నది ఎవరి చేతిలో లేదు, మొత్తానికి అధికార పక్షంలో కాంగ్రెస్ విపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఉన్నా గేమ్ చేంజర్ గా అందరి చూపూ హరీష్ మీదనే ఉంది అని అంటున్నారు.
