ఈటల రాజేందర్ తో మీటింగ్.. ఎట్టకేలకు బయటపెట్టిన హరీష్ రావు!
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఈటల రాజేందర్‌తో హరీష్ రావు సీక్రెట్ భేటి అంశం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 31 May 2025 1:10 PM ISTతెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఈటల రాజేందర్‌తో హరీష్ రావు సీక్రెట్ భేటి అంశం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు చిచ్చురేపాయి. బీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎంపీ ఈటలతో రహస్యంగా భేటీ అయ్యారన్న వాదనలు రాష్ట్రంలో రాజకీయ వేడి పెంచాయి. ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గట్టిగా స్పందించారు.
ఈటల రాజేందర్ ఒకప్పటి బీఆర్ఎస్ కీలక నేత. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనతో బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారని గౌడ్ ఆరోపించడం, కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాజకీయ సందేహాలు కలిగించడమే కాదు, విపక్ష ఐక్యతపై దృష్టిని మరల్చే ప్రయత్నంగా కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ సమయంలో, ఇటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ ను బలహీనపర్చే యత్నంగా అభివర్ణించవచ్చు.
హరీష్ రావు దీనిపై క్లారిటీ ఇచ్చారు. “బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు” అనే మాటలతో ఆయన ఆరోపణలను కొట్టిపారేశారు. సామాజిక సందర్భాలలో జరిగిన సాధారణ పరస్పర సమావేశాలను, రాజకీయ చర్చలుగా చిత్రీకరించడం శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు.“చిల్లర రాజకీయాలు”గా అభివర్ణిస్తూ, ఆయనపై ఎదురుదాడికి దిగారు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఎద్దేవా చేశారు.మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారని వ్యాఖ్యానించడం ద్వారా, గౌడ్‌ను స్వతంత్రంగా కాకుండా, కేవలం ఒక రాజకీయ ప్రచారకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు."ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలి" అని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణలకంటే పాలనపై దృష్టి పెట్టాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి రాజకీయ ఆరోపణలను ఒక సాధనంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు, బీఆర్ఎస్ దానిపై ఎదురుదాడి చేస్తూ, కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నంలో ఉంది.
