హరీశ్ రావు మాటలకు తీవ్ర భావోద్వేగానికి గురైన చిన్నారి
నాలుగు మంచి మాటలు చెప్పాలే కానీ.. వాటిని స్వీకరించటానికి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు.కాకుంటే.. చెప్పాల్సిన మాటల్ని వారికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పటం చాలా అవసరం.
By: Tupaki Desk | 20 April 2025 9:58 AM ISTనాలుగు మంచి మాటలు చెప్పాలే కానీ.. వాటిని స్వీకరించటానికి మన చుట్టూ ఎంతోమంది ఉంటారు.కాకుంటే.. చెప్పాల్సిన మాటల్ని వారికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పటం చాలా అవసరం. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు.. స్కూల్ పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. భద్రంగా ఉండాలని.. భవిష్యత్తులో ఎదగాలంటూ ఆయన తన అభిలాషను విద్యార్థులతో పంచుకున్నారు.
వేసవి సెలవుల్లో తెలిసీ తెలియని పనులతో ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా స్కూల్ విద్యార్థులతో కలిసి పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒక కార్యక్రమానికి చేపట్టారు. దీనికి అతిధిగా హాజరైన హరీశ్ రావు.. చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రుల గొప్పతనాన్ని.. వారి కష్టాన్ని.. పిల్లల విషయంలో వారు పడే ఆత్రుతను చెప్పుకొచ్చారు.
తన ప్రసంగం పూర్తైన తర్వాత.. కొందరు విద్యార్థుల్ని మాట్లాడేందుకు డయాస్ మీదకు పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధిపేటకు చెందిన నాగరాజు.. విజయ దంపతుల కుమార్తె సాత్విక మాట్లాడేందుకు వేదిక మీదకు వచ్చింది. ఏడో తరగతి చదువుతున్న చిన్నారి.. తన గురించి చెబుతూ తన తండ్రి తన చిన్నప్పుడే చనిపోయారని.. ఏమీ తెలియక తన తల్లిని చాలాసార్లు ఇబ్బంది పెట్టినట్లుగా పేర్కొంది. అయినా.. మా అమ్మే అన్నీతానై నన్ను చదివిస్తోంది.. ఇకపై ఆమెను ఇబ్బంది పెట్టబోను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురి కావటం.. వేదిక మీదేరోదించటంతో అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పలువురు కంటతడి పెట్టారు.
చిన్నారి మాటలకు మాజీ మంత్రి హరీశ్ కదిలిపోయారు. వెంటనే చిన్నారి సాత్వికను దగ్గరకు కూర్చోబెట్టిన ఆయన.. వారి ఇంటి వివరాల్ని ఆరా తీశారు. అనంతరం సాత్విక తల్లితో ఫోన్ లో మాట్లాడారు. భవిష్యత్తులో చిన్నారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయాల్ని పక్కన పెడితే.. హరీశ్ రావు విషయంలో చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని వారు ఎవరైనా సరే.. ఏ కష్టం వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తాను ఉన్నానన్న ధీమాను.. భరోసాను కల్పిస్తారు. అందరికి అందుబాటులో ఉండటమే కాదు.. క్షణం కూడా వేస్ట్ చేయకుండా నిత్యం వందలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూనే ఉంటారు. నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న రీచ్ సమకాలీన రాజకీయాల్లో ఉన్న అతి కొద్ది మంది నేతలకు మాత్రమే సాధ్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది.
