కేటీఆర్, కవితల మధ్య విభేదాలు.. నిజమెంత?
నిప్పు లేనిది పొగ రాదు అంటారు. అంతో ఇంతో గ్యాప్ లేనిదే ఈ పుకార్లు షికార్లు చేయవంటారు.
By: Tupaki Desk | 26 April 2025 12:29 PM ISTనిప్పు లేనిది పొగ రాదు అంటారు. అంతో ఇంతో గ్యాప్ లేనిదే ఈ పుకార్లు షికార్లు చేయవంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవితల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇందులో వాస్తవమెంత అన్న దానిపై క్లారిటీ లేదు కానీ.. మీడియా, సోషల్ మీడియాలో మాత్రం వీరి విభేదాలను ప్రత్యర్థులు ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై అటు కవిత కానీ.. ఇటు కేటీఆర్ కానీ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ లో కీలకమైన వీరి బావ, మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతలైన కేసీఆర్, కేటీఆర్ ఏర్పాట్లను పర్యవేక్షించడంలో బిజీగా ఉన్నారు. అయితే, పార్టీలో కీలక నేతగా, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు మాత్రం ఈ సభ ఏర్పాట్లలో ఎక్కడా చురుగ్గా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ సమయంలోనే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సడెన్ గా రంగంలోకి దిగారు. రజతోత్సవ ఏర్పాట్ల విషయంలో నిన్నటి వరకు అంటిముట్టనట్లు వ్యవహరించిన ఆమె, ఇప్పుడు ఒక్కసారిగా జోష్ పెంచారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. కుంభమేళా తరహాలో సభకు భారీ సంఖ్యలో జనం తరలిరావాలని, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిస్తూ, వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. కీలకమైన సభా ఏర్పాట్లలో హరీష్ రావు కనిపించకపోవడం, అదే సమయంలో కవిత చురుగ్గా వ్యవహరించడం బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
- సామా ట్వీట్ తో కలకలం
బీఆర్ఎస్ లోని ఈ అంతర్గత పరిణామాలపై ఇతర పార్టీల నేతలు సైతం స్పందిస్తున్నారు. టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. "హరీష్ రావు స్థానంలో కవిత? నేడు సభకి.. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కి.. ఇక హరీష్ దూరమేనా? అనూహ్య మలుపు తిరుగుతున్న గులాబీ పాలిటిక్స్" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కవిత, కేటీఆర్ మధ్యన ఈ ఆధిపత్యంలో విభేదాలు వచ్చాయంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.
దీంతో హరీష్ రావు తాజాగా కేటీఆర్ - కవితల మధ్య విభేదాలు ఉన్నాయనే వదంతులను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని, పార్టీలో సమస్యలు సృష్టించాలని చూస్తున్న కొందరు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
హరీష్ రావు మాట్లాడుతూ ‘తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నవారే ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. కేటీఆర్, కవిత మధ్య ఎలాంటి "కోల్డ్ వార్" లేదని, ఇది సోషల్ మీడియా సృష్టించిన గందరగోళం మాత్రమేనని స్పష్టం చేశారు. నేటి రాజకీయాల్లో నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో బీఆర్ఎస్ పై కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయని, మొదట్లో ప్రజలు వాటిని నమ్మారని గుర్తు చేశారు. అయితే ఏడాది కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత, ప్రజలు ఇప్పుడు రెండు ప్రభుత్వాల పాలనను పోల్చుకుంటున్నారని, తేడాను గ్రహిస్తున్నారని అన్నారు. "వాస్తవం తెలిసినప్పుడు, నిజం నిలబడుతుంది" అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సృష్టించిన వివాదాల వెనుక ఉన్న నిజం త్వరలోనే ప్రజలకు తెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మొత్తంగా హరీష్ రావు వ్యాఖ్యలు కేటీఆర్, కవిత మధ్య విభేదాలు కేవలం రాజకీయ దుష్ప్రచారం మాత్రమేనని, పార్టీ అంతర్గత ఐక్యత చెక్కుచెదరలేదని చెప్పకనే చెబుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను కొట్టిపారేస్తూ, ప్రజలు వాస్తవాలను గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.
