హరీశ్ రావు యాక్షన్ పైనే టెన్షన్.. ట్రబుల్ షూటర్ వ్యూహం ఏంటి?
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు రాజకీయ వ్యూహంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 25 May 2025 5:00 AM ISTబీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు రాజకీయ వ్యూహంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తారా? లేక యథావిధిగా పార్టీలో ట్రుబల్ షూటరుగా ప్రస్తుత వివాద పరిష్కారానికి కృషి చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అధినేత కేసీఆర్ కుడిభుజంగా వ్యవహరించిన హరీశ్ రావు తొలుత పార్టీలో నెంబర్ టుగా గుర్తింపు పొందారు. అయితే కేసీఆర్ వారసులు రాజకీయాల్లోకి వచ్చాక హరీష్‌రావు స్థానం కాస్త వెనక్కి వెళ్లిపోయిందని అంటారు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నాక హరీష్‌రావు నెంబర్ త్రి స్థానానికి పరిమితమైపోయారంటున్నారు.
ఇక తాజాగా అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారనే ప్రచారంతో హరీష్‌రావు పాత్ర ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. తన మేనమామ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విధేయుడి ఉంటూ ఆయన పిల్లలు కేటీఆర్, కవిత మధ్య చెలరేగిన వివాదాన్ని పరిష్కరిస్తారా? లేక తన రాజకీయ వ్యూహాన్ని పదునెక్కించి తానే బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకుంటారా? అనేది చూడాల్సివుందని పరిశీలకులు అంటున్నారు.
బీఆర్ఎస్ లో మాస్ లీడరుగా హరీష్‌రావుకు గుర్తింపు ఉంది. అధినేత కేసీఆర్ తర్వాత హరీష్‌రావుకే ఫాలోయింగు ఎక్కువనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో కేసీఆర్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన హరీష్‌రావు సిద్ధిపేట నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. సిద్దిపేట ఒకప్పుడు కేసీఆర్ సొంత నియోజకవర్గం కావడం విశేషం. సిద్దిపేటలో కేసీఆర్ విజయయాత్రను కొనసాగిస్తున్న హరీష్‌రావు ఆయన తర్వాత కారు స్టీరింగు పట్టుకుంటారని తొలుత భావించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తర్వాత హరీష్‌రావు అన్న ప్రచారమే ఉండేది.
అయితే తెలంగాణ ఉద్యమం తీవ్రతరమయ్యాక రాష్ట్రం తప్పనిసరిగా వస్తుందన్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఇద్దరు పిల్లలు రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ 2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో సిరిపిల్ల నుంచి పోటీ చేశారు. అదేసమయంలో కేటీఆర్ కుమార్తె కవిత కూడా తెలంగాణ జాగ్రుతి పేరిట ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ విధంగా చూస్తే హరీష్‌రావు తర్వాతే కేటీఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చినట్లు భావిస్తున్నారు.
అయితే 2014లో తెలంగాణ ఆవిర్భవించడం, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో హరీష్‌రావుతోపాటు కేటీఆర్, కవిత కూడా కీలకంగా వ్యవహరించారు. కవిత ఎంపీగా చక్రం తిప్పగా, హరీష్‌రావు, కేటీఆర్ మంత్రులయ్యారు. అయితే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీగా మారిన తర్వాత హరీష్‌రావు స్థాయిలోనూ మార్పు వచ్చిందని అంటుంటారు. అప్పటివరకు పార్టీలో నెంబర్ టు స్థానంలో కొనసాగిన హరీష్‌రావు అధినేత కేసీఆర్ వ్యూహంతో కేటీఆర్ కన్నా వెనకబడిపోయారు. అంతేకాకుండా కేటీఆర్ కు పార్టీలో వర్కింగు ప్రెసిడెంట్ స్థానం కట్టబెట్టి తన తర్వాత కేటీఆర్ అన్న సంకేతాలను పంపారు కేసీఆర్. అయితే ఈ పరిణామాలను అన్నీ గమనించిన హరీష్‌రావు వేరుకుంపటి పెడతారంటూ అప్పట్లోనే ప్రచారం జరిగినా, అధినేతకు విధేయుడిగా ఆయన మాట తూ.చ. తప్పకుండా పార్టీలో కొనసాగారు.
ఇదే సమయంలో పార్టీని కుదిపేసిన అనేక సంక్షోభాల్లో ట్రబుల్ షూటర్ గా తన వ్యూహరచనతో ఆయా సంక్షోభాలను పరిష్కరించారు హరీష్‌రావు. ప్రధానంగా ఉద్యమం నుంచి బీఆర్ఎస్ లో కొనసాగిన ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఆర్థిక మంత్రి ఈటల వంటివారు రాజీనామా తర్వాత పార్టీలో చీలిక రాకుండా అడ్డుకున్నారని హరీష్‌రావు పేరు చెబుతారు. అదేసమయంలో పార్టీపై ఎవరు వ్యతిరేకతతో ఉన్నా, వారితో మాట్లాడి తిరిగి పార్టీకి విధేయులుగా మార్పు తేవడంలో హరీష్‌రావు ముందుంటారు అంటారు.
ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రతిపక్షంలో ఉండగా, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభం అధినేత కేసీఆర్ కి తలనొప్పిగా మారిందని అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్యే ఆధిపత్య పోరు ఉండటం, పార్టీలో కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, తన పరిస్థితి ఏంటో ముందే చెప్పాలని కవిత ప్రశ్నిస్తుండటంతో బీఆర్ఎస్ లో సంక్షోభాన్ని తలపించే వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. ఇక అధినేత కేసీఆర్ తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని భావిస్తే హరీష్‌రావు స్థానం ఇప్పుడు ఉన్న సంఖ్య నుంచి మరికొంత తగ్గొచ్చని అంటున్నారు. అయితే హరీష్‌రావు మాత్రం నెంబర్ 1 కావాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో హరీష్‌రావు అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ బాస్ అవ్వాలనే తన అనుచరుల ఆలోచన దిశగా అడుగులు వేస్తారా? లేక ఎప్పటిలా ట్రబుల్ షూటర్ బాధ్యతలకే పరిమితమవుతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏదిఏమైనా ప్రస్తుత సంక్షోభంపై హరీశ్ రావు ఎక్కడా మాట్లాడటం లేదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంపై కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్నారు. తన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న చెల్లెలిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, హరీష్‌రావు మాత్రం ఎక్కడా ఏం మాట్లాడకపోవడమే ఉత్కంఠకు గురిచేస్తోంది.
