Begin typing your search above and press return to search.

హరీష్ రావు కొత్త పార్టీ ?

ఇంతకీ హరీష్ రావు కొత్త పార్టీ పెడతారా పెడితే ఎంత వరకూ అది సాధ్యం అన్న ప్రశ్నలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 May 2025 6:00 AM IST
హరీష్ రావు కొత్త పార్టీ ?
X

తాను బీఆర్ ఎస్ లోనే ఉంటాను, కేసీఆర్ మాటను జవదాటను అని ఆ పార్టీ అగ్ర నేత మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా గట్టిగా చెప్పారు ఆఖరుకు ఆయన ఎంత దాకా వెళ్ళారు అంటే కేటీఆర్ ని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా చేసినా తాను ఆ పార్టీలోనే కొనసాగుతాను అన్నారు. కేసీఆర్ మాటని తాను జవదాటను అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఇంత చేసినా కూడా హరీష్ రావు మీద రోజుకో పుకారు వస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో ఉండరని ఆ పార్టీలో ఆధిపత్య పోరాటం సాగుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తొందరలోనే హరీష్ రావు బయటకు వస్తారని ఆయన ఏకంగా కొత్త పార్టీ పెడతారు అని కూడా జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ కి చెందిన ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అయితే హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండరని తేల్చి చెబుతున్నారు.

ఆయన నూతనంగా పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయం తెలిసే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళి రెండు గంటల పాటు చర్చలు జరిపారని అన్నారు. హరీష్ రావు ఒక వైపు ఇలా ఉంటే కేసీఆర్ కుమార్తె కవిత మరో వైపు పార్టీలో తన ఆధిపత్యం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఆధిపత్య పోరులో నలుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ చెబుతున్నారు.

ఇంతకీ హరీష్ రావు కొత్త పార్టీ పెడతారా పెడితే ఎంత వరకూ అది సాధ్యం అన్న ప్రశ్నలు ఉన్నాయి. అయితే హరీష్ రావు బీఆర్ఎస్ లో సీనియర్ మోస్ట్ లీడర్. పైగా పక్కా మాస్ లీడర్, కేసీఆర్ మాదిరిగా వాక్చాతుర్యం ఆయన సొంతం. జనాలను నిలబెట్టించి తమ ప్రసంగంతో ఆకట్టుకునే నేర్పు హరీష్ రావుకు ఉంది.

అంతే కాదు ఆయన వ్యూహ చతురత కూడా వేరేగా ఉంటుంది. పల్లెలలో హరీష్ రావుకు పట్టుంది. ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆయనకు రూరల్ బేస్డ్ పాలిటిక్స్ లో మంచి అవగాహన ఉంది. రాజకీయాల్లో పల్లెల మీద ఎవరికి పట్టు ఉంటుందో వారే కీలక నాయకులుగా ఉంటారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ అంశం మీద తనదైన అవగాహన ఉంది. పైగా అన్ని పార్టీల నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సీఎం సీటుని ఆయన ఆశిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయన సీఎం మెటీరియల్ అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నది ఒక సామెత.

అలా బీఆర్ఎస్ లో కేటీఆర్ తో కలసి పనిచేస్తాను అని హరీష్ రావు ఎంత చెబుతున్నా అది సాధ్యమయ్యేనా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇక కేసీఆర్ మీద ఉన్న గౌరవంతో విధేయత చూపించవచ్చు కానీ దీర్ఘ కాలంలో అది కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు.

బహుశా ఇలాంటి అంచనాలతోనే కాంగ్రెస్ నేతలు కూడా హరీష్ రావుని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు హరీష్ రావు మీద బీజేపీ పెద్దల కన్ను కూడా ఉందని ప్రచారం సాగుతోంది. ఆయన ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. పక్కా తెలంగాణావాది. ఎంతో భవిష్యత్తు ఉన్న నేత కావడంతో ఆయనను తమ వైపు తిప్పుకోవాలని ఇతర ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి.

మరి హరీష్ రావుకు బీఆర్ ఎస్ ని వీడే ఉద్దేశ్యం లేకపోవచ్చు కానీ ఆయనను కనుక ఆ పార్టీ నుంచి వేరు చేయడం లేదా ఆయనను చూపించి విభేదాలు ఉన్నాయని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో మంచి వ్యూహకర్త అయిన హరీష్ రావు ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు అని అంటున్నారు.