Begin typing your search above and press return to search.

హ‌రిద్వార్‌లో ఏం జ‌రిగింది? ఆరుగురు మృతికి రీజ‌నేంటి?

శ్రావ‌ణ శుక్ర‌వారం మాదిరిగానే.. ఉత్త‌రాది ప్ర‌జ‌లు శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే ఆదివారాల‌ను.. సోమ‌వారాల‌ను ప‌విత్రంగా భావిస్తారు.

By:  Tupaki Desk   |   27 July 2025 3:39 PM IST
హ‌రిద్వార్‌లో ఏం జ‌రిగింది?  ఆరుగురు మృతికి రీజ‌నేంటి?
X

హ‌రిద్వార్‌.. హిందులు అత్యంత ప‌విత్రంగా భావించే పుణ్య‌స్థ‌లం. అలాంటి చోట ఆదివారం అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ల‌క్ష‌లాదిగా భ‌క్తులు ఎందుకు త‌ర‌లి వ‌చ్చారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప‌విత్ర శ్రావ‌ణ మాస ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్ లో ఉన్న మాన‌సాదేవి(అక్క‌డి వారు మ‌న్సా దేవి అంటారు) ఆలయానికి ఆదివారం భ‌క్తులు పోటెత్తారు.

శ్రావ‌ణ శుక్ర‌వారం మాదిరిగానే.. ఉత్త‌రాది ప్ర‌జ‌లు శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే ఆదివారాల‌ను.. సోమ‌వారాల‌ను ప‌విత్రంగా భావిస్తారు. ఈ క్ర‌మంలో శ్రావణ ఆదివారం నాడు.. మాన‌సాదేవిని కొలుచుకుంటే.. మ‌న‌సులో ఉన్న కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని న‌మ్ముతారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం మాన‌సాదేవి ఆల‌యానికి ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. ఇంత మంది భ‌క్తుల‌కు స‌రైన ఏర్పాట్లు చేయ‌లేక పోవ‌డం ఒక స‌మ‌స్య అయితే.. ఇంత‌లోనే.. లైన్‌లో ఉన్న భ‌క్తుల‌కు ఎక్క‌డో విద్యుత్ షాక్ త‌గిలి.. ప‌లువురు భ‌క్తులు కింద ప‌డిపోయార‌న్న వార్త చెవిలో ప‌డింది.

అంతే.. ఒక్క‌సారిగా భ‌క్తులు క్యూలైన్ల నుంచి బ‌య‌ల‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో తొక్కిస లాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గర్హ్వాల్‌ కమిషనర్‌ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అంది స్తున్నామని.. ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింద‌న్నారు.

అయితే.. అస‌లు విద్యుత్‌ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని విన‌య్ శంక‌ర్ పాండే వివ‌రించారు. ఇక‌, బీజేపీ నేతృత్వంలో కొన‌సాగుతున్న ప్ర‌భుత్వం ఉండ‌డంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌చ్చినా స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.