Begin typing your search above and press return to search.

గ్యాస్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు.. నిప్పు రాజేసిన సిలిండర్ కొరత!

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   13 March 2026 4:00 PM IST
గ్యాస్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు.. నిప్పు రాజేసిన సిలిండర్ కొరత!
X

వంటగదిలో ఘుమఘుమలాడాల్సిన గ్యాస్ పొయ్యిలు ఇప్పుడు రాజకీయ సెగలను వెదజల్లుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా అస్తవ్యస్తం కావడం భారత్‌లో గ్యాస్ సంక్షోభానికి దారితీసింది. అయితే, ఈ ఇబ్బందులకు కేంద్రం బాధ్యత వహించాలని రాష్ట్రాలు, రాష్ట్రాల పట్టించుకోలేని తనం వల్లే ఈ పరిస్థితి అని కేంద్రం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కొరత లేదని భరోసా ఇస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం సామాన్యుడికి సిలిండర్ అందడం ఒక ప్రహసనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వేర్వేరు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి.

అపోహలే అతిపెద్ద శత్రువు!

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సిలిండర్ల కొరత లేదని, కేవలం యుద్ధం వస్తుందనే భయంతో ప్రజలు ముందస్తుగా ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకోవడం వల్లే ఈ తాత్కాలిక షాటేజీ కనిపిస్తోందని స్పష్టం చేశారు. ‘గ్యాస్ సరఫరాలో అక్రమాలకు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలదే’ అని ఆయన చురకలు అంటించారు. అంటే, బ్లాక్ మార్కెట్ ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని కేంద్రం పరోక్షంగా నిలదీస్తోంది.

పొన్నం ప్రభాకర్ ఆగ్రహం!

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు. తెలంగాణకు గ్యాస్ కోటాను పెంచాలని, సరఫరాలో ఉన్న అడ్డంకులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై కూడా కేంద్రాన్ని నిలదీస్తూ, సామాన్యుడిపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గ్యాస్ పంపిణీని పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

ఆంధ్రప్రదేశ్ వ్యూహం..

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటోంది. తమ రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. వదంతులను నమ్మి ప్రజలు కంగారు పడవద్దని, ప్రతి ఒక్కరికీ రెండు రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి ఎల్ఓసీఎల్ ( IOCL), హెచ్ పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) డైరెక్టర్లతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. అత్యవసర రంగాలకు (ఆసుపత్రులు, ముఖ్యమైన సంస్థలు) మొదటి ప్రాధాన్యతిస్తూ, గృహ అవసరాలకు ఢోకా లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇరు వైపులా పెరుగుతున్న మంటలు!

రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా, వాస్తవానికి గ్యాస్ ధరలు, సరఫరాలో ఉన్న షరతులు రాష్ట్రాలకు తలనొప్పిగా మారాయి. కేంద్రం సరఫరా పెంచాలని రాష్ట్రాలు కోరుతుంటే, నిల్వలను సక్రమంగా నిర్వహించాలని కేంద్రం సూచిస్తోంది. మధ్యలో సామాన్య ప్రజలు మాత్రం బుకింగ్స్ పెండింగ్‌లో ఉండడం చూసి ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద అక్రమ నిల్వలు పెరగడం, కమర్షియల్ సిలిండర్ల కోసం డొమెస్టిక్ గ్యాస్ ను వాడటం వంటివి ఈ సంక్షోభాన్ని మరింత పెంచుతున్నాయి.

వంట గ్యాస్ అనేది రాజకీయం చేసే వస్తువు కాదు.. అది ప్రతి ఇంటి అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి, సమన్వయంతో పని చేయాల్సిన సమయం ఇది. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలి, అదే సమయంలో సరఫరాలో ఎటువంటి జాప్యం లేకుండా కేంద్రం చూడాలి. ప్రజలు కూడా అనవసరంగా భయపడి భారీగా బుకింగ్స్ చేయకుండా, తమ అవసరానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే ఈ కృత్రిమ కొరతను అధిగమించవచ్చు. మరి ఈ గ్యాస్ మంటలు ఎప్పుడు చల్లారుతాయో వేచి చూడాలి!