అబ్బనీ తియ్యనీ చెంపదెబ్బ.. 18 ఏళ్ల తర్వాతా గట్టిగా మోగుతోంది
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 2008లో మొదలైంది.
By: Tupaki Desk | 1 Sept 2025 12:43 AM ISTఒకరేమో దేశం నుంచి పరారైన వ్యాపారవేత్త.... ఐపీఎల్ రూపకర్త.. బీసీసీఐలో ఒకప్పటి పవర్ ఫుల్ పర్సన్.. మరొకరేమో ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా పనిచేసిన.. ఇటీవలే క్యాన్సర్ శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ క్రికెటర్.. వీరిద్దరి మధ్య ఎప్పుడు జరిగిందో కానీ ఓ సంభాషణ తాజాగా వైరల్ అవుతోంది. అందులో మూడో వ్యక్తి గురించి మాట్లాడడమే దీనికి కారణం... అదికూడా 18 ఏళ్ల కిందట జరిగిన సంఘటన కావడం గమనార్హం.
తొలి సీజన్ లోనే..
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 2008లో మొదలైంది. తొలి సీజన్ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఐపీఎల్ ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే, 2008 సీజన్ లోనే ఓ ఘటన జరిగింది. అప్పుడు ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. మ్యాచ్ ముగిశాక పంజాబ్ కింగ్స్ పేసర్ ను చెంప దెబ్బ కొట్టాడు. ఇప్పుడు ఈ వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్, ఆర్థిక ఆరోపణలతో దేశం విడిచి పరారైన లలిత్ మోదీ.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తో సంభాషణ సందర్భంగా విడుదల చేశాడు. హర్భజన్ పై అప్పట్లోనే 8 మ్యాచ్ ల నిషేధం విధించినట్లు తెలిపాడు. కానీ, లలిత్ మోదీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సంఘటన గురించి అప్పట్లో తెలియనివారికీ తెలిసేలా చేసింది.
పాత గాయాన్ని రేపుతారా?
లలిత్ మోదీ చర్యపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఎప్పుడో 2008లో జరిగిన ఉదంతంతో తమ కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందన్నారు. చీప్ పబ్లిసిటీ, వ్యూస్ కోసం ఇలా చేస్తారా? అంటూ మండిపడ్డారు. అయితే, లలిత్ మోదీ మాత్రం.. తాను నిజం చెప్పానని, వాస్తవానికి నాడు జరిగిన ఘటనలో శ్రీశాంత్ బాధితుడని తెలిపారు.
మీకు సిగ్గుందా..?
లలిత్ మోదీతో పాటు మైకేల్ క్లార్క్ పైనా శ్రీశాంత్ భార్య భువనేశ్వరి నిప్పులు చెరిగారు. కాస్తయినా సిగ్గులేదా? ఆ ఇద్దరు క్రికెటర్ల పిల్లలు ఇప్పుడు సూళ్లకు వెళ్తున్నారు. ఏ పాపం తెలియనివారు కూడా ఇకమీదట ప్రశ్నలు ఎదుర్కొనాల్సి వస్తుంది. చీప్ పబ్లిసిటీ కోసం ఇంతకు తెగిస్తారా? మీకసలు మానవత్వం ఉందా...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి దాదాపు 18 ఏళ్ల కిందట జరిగిన ఘటన అబ్బనీ తియ్యనీ దెబ్బ అన్నట్లు మూడు రోజులుగా సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది.
