Begin typing your search above and press return to search.

రైల్లో మహిళా కానిస్టేబుల్ కు వేధింపులు.. వాడ్ని ఏసేసిన పోలీసులు

హద్దులు దాటిన వారి విషయంలో తనదైన మార్క్ నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

By:  Tupaki Desk   |   23 Sep 2023 3:57 AM GMT
రైల్లో మహిళా కానిస్టేబుల్ కు వేధింపులు.. వాడ్ని ఏసేసిన పోలీసులు
X

హద్దులు దాటిన వారి విషయంలో తనదైన మార్క్ నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే క్రిమినల్స్ ఆస్తుల్ని బుల్ డోజర్లు పెట్టి కూల్చేస్తూ.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన ఆయన ప్రభుత్వం.. దారుణ నేరాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రభుత్వం.. అధికారులు అనుసరిస్తున్న విధానాలపై కొందరు తీవ్రంగా స్పందిస్తున్నా.. యోగి సర్కారు మాత్రం తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతోంది.

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటుచేసుకుంది. తాజాగా పరారీలో ఉన్న ఒక క్రిమినల్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. అతగాడి పాప చరిత అంతలా ఉండటమే. కొద్ది కాలం క్రితం రైల్లో ప్రయాణిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ను వేధింపులకు గురి చేసిన నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 30న సరయూ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ తో సీటు విషయంలో గొడవ పడ్డాడు.

ఇది కాస్తా ఘర్షణగా మారటం.. నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. అయోధ్య స్టేషన్ లో వారంతా దిగి వెళ్లిపోయారు. ట్రైన్ బోగీలో రక్తపు మడుగులో ఉన్న మహిళా కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ లోనూ వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతాన్ని అలహాబాద్ హైకోర్టు సుమోటోగా స్వీకరించి.. రాష్ట్ర ప్రభుత్వం మీదా.. రైల్వే పోలీసులపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిందితుడ్ని గుర్తించి.. అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది.

పోలీసుల విచారణలో మహిళా కానిస్టేబుల్ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన వ్యక్తిని అనీశ్ ఖాన్ గా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసేందుకు అయోధ్యలో సోదాలు చేపట్టారు. పోలీసుల్ని చూసిన అనీశ్ ఖాన్.. అతడి అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాల్పుల్లో గాయపడిన అనీశ్ ను ఆసుపత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ మరణించినట్లుగా పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఇతడ్ని అదుపులోకి తీసుకునేందుకు జరిపిన ఆపరేషన్ లో ఒక కానిస్టేబుల్ కు బులెట్ తగిలి గాయమైనట్లుగా పేర్కొన్నారు.