Begin typing your search above and press return to search.

రేవంతే తెలంగాణా సీఎం.. పెద్దాయన వీహెచ్ బ్లెస్సింగ్స్...!

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. పూర్తి మెజారిటీని కూడా సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది

By:  Tupaki Desk   |   3 Dec 2023 9:04 AM GMT
రేవంతే తెలంగాణా సీఎం.. పెద్దాయన వీహెచ్ బ్లెస్సింగ్స్...!
X

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. పూర్తి మెజారిటీని కూడా సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠకు మాత్రం తెర పడడంలేదు. దాంతో కాంగ్రెస్ లో ఎవరు సీఎం అన్న దాని మీద అనేక రకాలైన పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ వృద్ధ నేత వీ హనుమంతరావు మాత్రం రేవంత్ రెడ్డికే మద్దతు ప్రకటించడం విశేషం. తెలంగాణాకు కొత్త సీఎం కచ్చితంగా రేవంత్ రెడ్డి అవుతారు అని ఆయన అంటున్నారు. తన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన చెబుతూ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు.

నిజానికి కాంగ్రెస్ అధినాయకత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త సీఎం ఎవరు అవుతారు అన్నది డిసైడ్ చేస్తారని కానీ రేవంత్ రెడ్డి అయిఏ బాగుంటుంది అన్నది తన సొంత అభిప్రాయంగా ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణా కాంగ్రెస్ కి కొత్త శక్తిని ఇచ్చారని వీహెచ్ అంటున్నారు.

ఎన్నికల సమయంలో పార్టీని రేవంత్ రెడ్డి మొత్తం తాను అయి నడిపించారు అని కూడా వీహెచ్ పేర్కొన్నారు. నిజాయితీగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలని వీహెచ్ తన అభిప్రాయాని కుండబద్ధలు కొట్టారు. ఇక తన జీవిత పర్యంతం కాంగ్రెస్ లో ఉన్న వీహెచ్ వంటి సీనియర్ నేత మద్దతు రేవంత్ రెడ్డికి దక్కడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ లో వ్యూహాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక సీనియర్లు కూడా సీఎం పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ పీఠ ముడి తెగేది కాదని అంటున్నారు.

మరో వైపు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం అంతా పార్టీ పార్టీ నేతలు కార్యకర్తలతో నిండిపోయింది. గాన్ధీభవన్‌కు ర్యాలీగా బయలుదేరిన రేవంత్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ అభిమానులు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు తెలంగాణా డీజీపీతో పాటు ఇతర ఉన్నత అధికారులు కూడా రేవంత్ రెడ్డిని కలవడం అంటే కాబోయే సీఎం ఆయనే అన్న భావన మరింతంగా బలపడుతోంది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి కి అన్నీ మంచి శకునములే అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు.