Begin typing your search above and press return to search.

రైల్ ఎక్కే దిగే గ్యాప్ లో 18 మందిపై కత్తితో దాడి.. ఎవరీ మహిళ?

రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై నిల్చున్న వారిపై ఉన్నఫలంగా కత్తితో దాడి మొదలైంది. అక్కడ నిల్చున్న వారిపై ఒక్కసారిగా ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం మొదలుపెట్టింది!

By:  Tupaki Desk   |   24 May 2025 9:34 AM IST
రైల్ ఎక్కే దిగే గ్యాప్ లో 18 మందిపై కత్తితో దాడి.. ఎవరీ మహిళ?
X

రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై నిల్చున్న వారిపై ఉన్నఫలంగా కత్తితో దాడి మొదలైంది. అక్కడ నిల్చున్న వారిపై ఒక్కసారిగా ఓ మహిళ విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడం మొదలుపెట్టింది! శుక్రవారం సాయంత్రం జర్మనీలోని హంబర్గ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... జర్మనీలో రెండో అతిపెద్ద నగరమైన హాంబర్గ్ డౌన్ టౌన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాఫమ్ పై ఉన్నవారిపై ఓ మహిళ కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ ఘటనలో కనీసం 18 మంది గాయపడ్డారని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రిక తెలిపింది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది!

ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఓ అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే 39 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశామని.. ఆమె ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు!

ఈ సందర్భంగా స్పందించిన హాంబర్గ్ పోలీసు ప్రతినిధి ఫ్లోరియన్ అబెన్సేత్... హాంబర్గ్ డౌన్ టౌన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లోని 13, 14 ట్రాకుల మధ్య ప్లాట్ ఫారమ్ లపై ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని.. వేచి ఉన్న రైలులోకి ప్రయాణికులు ఎక్కుతున్నప్పుడు, రైలు నుంచి దిగుతున్నప్పుడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని చెబుతున్నారు.

దీంతో... స్టేషన్ లో నాలుగు ట్రాక్ లు మూసివేయబడ్డాయి. మరికొన్న్ని రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో... అదుపులోకి తీసుకొన్న మహిళ మానసిక క్షోభలో ఉందా.. లేక, ఈ ఘటన వెనుక మరేదైనా రాజకీయ ప్రేరణ ఉందా అనేది దర్యాప్తు చేస్తున్నామని అబెన్సేత్ అన్నారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్మనీ సమాఖ్య ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మ్యూనిచ్ లో జనంపైకి ఓ కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో 24 ఏళ్ల ఆఫ్ఘన్ జాతీయుడు అయిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.