Begin typing your search above and press return to search.

బందీలతో హమాస్ కొత్త ఎత్తుగడ... బేరాలు లేవంటున్న నెతన్యాహు!

ఇందులో భాగంగా ఆ వీడియోలో మాట్లాడిన, పక్కన ఉన్న మహిళలు డేనియల్‌ అలోని, యెలేనా ట్రుపనోవ్‌, రిమన్‌ క్రిష్ట్‌ అని గుర్తించినట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:30 PM GMT
బందీలతో హమాస్  కొత్త ఎత్తుగడ... బేరాలు లేవంటున్న నెతన్యాహు!
X

గాజాలో ఇజ్రాయెల్ దళాలకు, హమాస్‌ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న యుద్ధం మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇందులో భాగంగా... ఉత్తర గాజా సొరంగాల్లోని స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేస్తోంది. దీంతోపాటు వైమానిక దాడులూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా... గడచిన 24 గంటల్లో 300 వైమానిక దాడులు జరిగాయి. ఇటు భూతల దాడులతోనూ, అటు వైమానిక దాడులతోనూ గాజాను గజలాడించేస్తూ, హమాస్ ను ముప్పు తిప్పలు పెడుతుందట ఇజ్రాయేల్ సైన్యం.

ఈ క్రమంలో... గాజా నగర శివార్లలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌ మెంటుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మరణించగా వందల మంది గాయపడ్డారని అంటున్నారు. ఈ సమయంలో భూతల దాడుల ఫలితంగా... హమాస్‌ చెర నుంచి సైనికురాలిని విడిపించింది ఇజ్రాయేల్ సైన్యం. దీంతో... సైన్యాన్ని అభినందించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. కాల్పుల విరమణ ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు.

ఈ సమయలో ఇప్పటికే పలు దేశాల నుంచి హమాస్ సంస్థ ఇజ్రాయేల్ కు రాయబారాలు పంపుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. దాడులు ఆపేసి తమ బందీలను విడుదల చేస్తే... ఇజ్రాయేల్ బందీలను తిరిగి అప్పగిస్తామని చెబుతున్నారు. అయితే... తమ బందీలను ఎలా విడిపించుకోవాలో తమకు తెలుసు, బేరాలు లేవన్నట్లుగా ఇజ్రాయేల్ సైన్యం దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఆ దేశ ప్రధాని నెతన్యాహు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో హమాస్ మరో ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా... తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ మహిళతో మాట్లాడించింది. ఈ సందర్భంగా ఆమె ఇజ్రాయేల్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 76 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా... ఇది చీప్ ట్రిక్ అని, క్రూరమైన ప్రచారమని ఇజ్రాయేల్ మండిపడుతుంది.

అవును... "గత 23 రోజులుగా మేం హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నాం. మీ రాజకీయ, భద్రతా కారణాలు, సైనిక వైఫల్యంవల్ల మేం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌.. గాజాలో భీకర దాడులు చేస్తోందని మాకు తెలిసింది. అయితే... మీరు మమ్మల్ని నిజంగా కాపాడాలనుకుంటే వారి ఖైదీలను విడిచిపెట్టండి. మమ్మల్ని విడిపించండి" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను హమాస్ విడుదల చేసింది.

దీంతో ఈ వీడియోపై నెతన్యాహు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆ వీడియోలో మాట్లాడిన, పక్కన ఉన్న మహిళలు డేనియల్‌ అలోని, యెలేనా ట్రుపనోవ్‌, రిమన్‌ క్రిష్ట్‌ అని గుర్తించినట్లు తెలిపారు. ఇది తమను మానసికంగా దెబ్బతీసేందుకు హమాస్‌ చేస్తున్న క్రూరమైన ప్రచారం అని ప్రధాని అన్నారు. ఇదే క్రమంలో... బందీలను తప్పకుండా కాపాడతాం. ప్రతి ఒక్కరినీ విడిపిస్తాం అని భరోసా ఇచ్చారు.

దీంతో... హమాస్ చేసిన ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణ సిరియాకు విస్తరించిందని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో... ఇజ్రాయెల్‌ పై దాడులు చేశామని యెమెన్‌ లోని రెబల్స్‌ గ్రూప్‌ హౌతీ వెల్లడించింది. దీంతో ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంలోకి ఇరాన్‌ వచ్చినట్లైందని చెబుతుంది.