Begin typing your search above and press return to search.

అత్యంత సున్ని త సరిహద్దు.. మళ్లీ భగ్గుమంది.. మనోళ్ల పరిస్థితి ఏమిటో?

ప్రపంచంలోనే అత్యంత భయంకర ఉగ్రవాద సంస్థ హమాస్. అత్యంత భీకరంగా దాడి చేయగల దేశం ఇజ్రాయిల్.

By:  Tupaki Desk   |   7 Oct 2023 8:45 AM GMT
అత్యంత సున్ని త సరిహద్దు.. మళ్లీ భగ్గుమంది.. మనోళ్ల పరిస్థితి ఏమిటో?
X

ప్రపంచంలోనే అత్యంత భయంకర ఉగ్రవాద సంస్థ హమాస్. అత్యంత భీకరంగా దాడి చేయగల దేశం ఇజ్రాయిల్. వీటి మధ్య ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ఆ సరిహద్దు మళ్లీ భగ్గుమంది.. చుట్టూ శత్రుదేశాలు.. మధ్యలో అన్నివిధాలుగా భిన్నమైన ఆ దేశం.. సుదూరాన ఉన్న దేశాలకూ అది శత్రువే.. అలాంటి పరిస్థితుల్లో క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే.. కొన్నాళ్లుగా ప్రశారంతంగానే ఉన్న ఆ సరిహద్దు ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెట్రేగాయి. శనివారం ఉదయం గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పైకి రాకెట్లు వదిలారు. అవి ఒకటీ రెండు కాదు.. 5 వేల రాకెట్లను ప్రయోగించినట్లు సమాచారం. దీంతోపాటు సరిహద్దులను దాటి ఇజ్రాయిల్ లోకి చొరబడ్డారు. దీంతో ఇజ్రాయిల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. యుద్ధం వాతావరణం నెలకొందని కూడా ప్రకటించింది.

ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య గాజాస్ట్రిప్ అత్యంత సున్నిత ప్రాంతం. ఊహించని పరిణామంతో ఇజ్రాయిల్ కంగుతిన్నది. 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లను ప్రయోగించడంతో ఇజ్రాయిల్ ప్రధాన నగరాలు జెరూసలెం, టెల్ అవీవ్ సహా దేశమంతా సైరన్ల మోత మోగించారు. కాగా, ఓవైపు రాకెట్లు ప్రయోగిస్తూనే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ఓకి ప్రవేశించి పేలుళ్లకు పాల్పడ్డారు.

మేం యుద్ధానికి దిగాం..: హమాస్

ఇజ్రాయిల్ పై హమాస్ పెద్ద వ్యూహంతోనే దాడికి దిగినట్లుగా స్పష్టమవుతోంది. తాము మిలిటరీ ఆపరేషన్‌ ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ అధిపతి మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించడమే దీనికి నిదర్శనం. శనివారం తెల్లవారుజామున ప్రారంభించిన

దాడిని 'ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌' గా అభివర్ణించాడు. కాగా, డెయిఫ్‌పై ఇదివరకు పలు దాడులు జరిగాయి. అండర్ గ్రౌడ్ లో ఉంటున్నాడు. ఇజ్రాయిల్ పై దాడి నేపథ్యంలో వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది.

తోక తొక్కిన తాచులా ఇజ్రాయిల్..

తమకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నట్లు తేలినా తీవ్రంగా స్పందించే ఇజ్రాయిల్.. హమాస్ దాడిని అణగదొక్కేందుకు సిద్ధమైంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులకు దిగుతోంది. మిలిటెంల్ల రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను అప్రమత్తం చేసింది. అంతేకుద.. యుద్ధానికి సిద్ధగా ఉన్నామని కూడా ప్రకటించింది. అయితే, గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అధీనంలోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్‌ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

ఇజ్రాయిల్ లో మనోళ్లు 900 మంది

విద్య, పరిశోధన రంగాల్లో ఇజ్రాయిల్ ది ఉన్నత స్థాయి. ఆ దేశంలో మన విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు 900 మంది భారతీయ విద్యార్థులు ఇజ్రాయిల్ లో ఉన్నట్లు సమాచారం. వారు ఎలా ఉన్నారోనని తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, మరణాలు భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అన్నిటికి మించి సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. కాగా, 1967 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.