Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ - హమస్ యుద్ధంలో ఏయే దేశాలు ఎటువైపు?

రెండు దేశాల మధ్య ఉన్న వివాదాన్ని మిలిటెంట్ల గ్రూపు అతి చర్య కాస్తా ఇప్పుడు ప్రపంచానికి కొత్త సమస్యను తెచ్చి పెట్టింది

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:34 AM GMT
ఇజ్రాయెల్ - హమస్ యుద్ధంలో ఏయే దేశాలు ఎటువైపు?
X

రెండు దేశాల మధ్య ఉన్న వివాదాన్ని మిలిటెంట్ల గ్రూపు అతి చర్య కాస్తా ఇప్పుడు ప్రపంచానికి కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ప్రపంచ ప్రజల మీద మరో యుద్ధాన్ని రుద్దింది. ఇజ్రాయెల్ -పాలస్తీనా మద్య నెలకొన్న వివాదాన్ని హమస్ ఉగ్రచర్య కారణంగా పశ్చిమాసియా మరో యుద్ధాన్ని నెత్తిన పడింది. హమస్ ఉగ్రమూక మెరుపుదాడి.. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలతో ఇప్పటికే వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భారీఎత్తున ఆస్తి నష్టం వాటిల్లుతుంది. పర్యావరణానికి జరిగే నష్టం మరింత ఎక్కువ.

ఈ వరుస ఉదంతాలపై ఆయా దేశాలు స్పందిస్తున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ సైతం స్పందించటం.. ఇజ్రాయెల్ కు భారత్ మద్దతు ప్రకటించటం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో తెలీని పరిస్థితి. హమస్ దాడులను ఖండిస్తూ 84 దేశాలు తమకు మద్దతు ప్రకటించినట్లుగా ఇజ్రాయెల్ విదేశాంగ వెల్లడించింది. ఇజ్రాయెల్ కు మొట్టమొదటిగా మద్దతు ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికానే. ఇజ్రాయెల్ మీద దాడి జరిగిన వెంటనే.. ఆ దేశానికి తమ మద్దతు తెలపటంతో పాటు 2వేల మంది సైనికులు ఇజ్రాయెల్ చేరుకున్నారు. వీరితో పాటు ఫైటర్ జెట్ టీం చేరుకుంది.

అంతేకాదు.. అవసరమైతే మరో 3వేల మంది సైనికుల్ని.. యుద్ధ నౌకల్ని పంపేందుకు అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. అంతేకాదు మందుగుండు సామాగ్రి.. ఇతరాల్ని సైతం పంపేందుకు రెఢీ అవుతోంది. అమెరికాతో పాటు బ్రిటన్.. ఫ్రాన్స్.. ఆస్ట్రేలియా.. భారత్ లు కూడా హమస్ దాడుల్ని ఖండించి.. ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించాయి. ఈ దేశాలతో పాటు నార్వే.. ఆస్ట్రియా.. జర్మనీ.. కెనడా.. పోలండ్.. స్పెయిన్ తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ మీద దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తుంటే.. హమస్ దారుణ దాడిని సమర్థిస్తున్న దేశాలు ఉన్నాయి. హమస్ ను సమర్థిస్తూ.. వారి చర్యల్ని వెనకేసుకొస్తున్న దేశాల వారి ప్రధాన డిమాండ్.. ఇజ్రాయెల్ ప్రతిదాడిని వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇరాన్ అగ్రస్థానాన నిలుస్తుంది. నిజానికి ఇరాన్.. ఇజ్రాయెల్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పాలస్తీనా వాదాన్ని సమర్థిస్తున్న ఇరాన్.. హమస్ కు తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది.

హమస్ ఉగ్రవాదుల మెరుపుదాడిని ఇరాన్ అధ్యక్షుడు పొగిడేయటం గమనార్హం. మెరుపుదాడి చేసినందుకు చాలా గర్వంగా ఉందన్న ఆయన.. దాన్నో గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే.. తాము హమస్ కు మద్దతు ఇవ్వట్లేదని ప్రకటించటం ద్వారా రెండు నాల్కుల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. హమస్ చర్యకు మద్దతుగా దక్షిణాఫ్రికా.. యెమెన్.. సౌదీ అరేబియా.. ఖతార్ లు ఉన్నాయి. సౌదీ మాత్రం.. పాలస్తీనా పోరాటానికి మద్దతు ఇస్తూనే.. ఇజ్రాయెల్ కు తాను వ్యతిరేకం కాదని చెబుతోంది.

మరోవైపు ఖతార్ సైతం హమస్ కు దన్నుగా నిలుస్తోంది. ఇజ్రాకయెల్ దాడిని సమర్థించింది. పాకిస్థాన్.. అఫ్గానిస్తాన్.. లెబనాన్ దేశాలు కూడా హమస్ కు మద్దతు పలుకుతున్న వారి జాబితాలో ఉండటం గమనార్హం.