పారిపోయి మరో పెళ్లి చేసుకున్న హమాస్ అధినేత భార్య... ఏం జరిగిందంటే..!
అందులో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ఒకరు. ఈ క్రమంలో.. ఆయన భార్యకు సంబంధించిన ఓ సంచలన విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది.
By: Tupaki Desk | 27 July 2025 9:00 PM ISTహమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం అవిరామంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ ఆధీనంలోని గాజా గజగజలాడిపోతోన్న పరిస్థితి. ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ అగ్రనేతలంతా మట్టుబెట్టబడ్డారు. అందులో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ఒకరు. ఈ క్రమంలో.. ఆయన భార్యకు సంబంధించిన ఓ సంచలన విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది.
అవును... ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ గత ఏడాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... అతడి మరణానంతరం ఆయన భార్య సమర్ మహమ్మద్ అబూ జమర్ పిల్లలతో సహా గాజా నుంచి నకిలీ పాస్ పోర్టుతో టర్కీకి పారిపోయినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థ పేర్కొంది. అక్కడ ఆమె మరో వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి సిన్వర్ తో ఆమెకు 2011లో వివాహం జరిగింది. ఆమె గాజాలోని ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నుండి వేదాంతశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అయితే 2024లో ఐడీఎఫ్ దాడుల్లో సిన్వర్ మృతి చెందిన తర్వాత.. హమాస్ ఉన్నతాధికారుల సహాయంతో గాజాలోని ఓ మహిళ పాస్ పోర్టును వాడుకొని ఆమె తన పిల్లలతో టర్కీ వయా ఈజిప్టు పారిపోయినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే... ఆమె తిరిగి వివాహం చేసుకుందని.. టర్కీలో జరిగిన ఈ రెండో వివాహానికి హమాస్ రాజకీయ బ్యూరోలో సీనియర్ అధికారి ఫాతి హమ్మద్ సహకరించారని నివేదిక పేర్కొంది. సిన్వర్ మరణం తర్వాత కొంతకాలం ఆ బృందానికి నాయకత్వం వహించిన యాహ్యా సిన్వర్ సోదరుడు మొహమ్మద్ భార్య నజ్వా కూడా అదే తరహాలో గాజాను విడిచిపెట్టినట్లు భావిస్తున్నారు.
కాగా... అక్టోబరు 7 - 2023న హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఈ దాడులకు సూత్రధారి అయిన హమాస్ అధినేత సిన్వర్ ను హతమర్చాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో గతేడాది ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో సిన్వర్ మృతి చెందాడు. సిన్వర్ హత్యకు ముందు గాజాలోని ఓ సొరంగంలో ఆయన తన భార్యాపిల్లలతో వెళ్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. మరోవైపు సిన్వర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు కీలక విషయాలు వెల్లడించారంటూ న్యూయార్క్ టైమ్స్ నాడు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం... హమాస్ నాయకుడు సిన్వర్ తలపై తుపాకీతో కాల్చి చంపబడ్డాడు. ఇదే సమయంలో.. మరణానికి ముందు అతడి ముంజేయి నలుగగొట్టబడింది.. అప్పుడు తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇక అతని ముంజేయికి చిన్న క్షిపణి లేదా మరేదైన బలమైన వస్తువు తగిలి పగిలిపోయిందని చెప్పారు.
