665 రోజులుగా టన్నెల్లో బందీగా... హమాస్ షాకింగ్ వీడియో!
ఇజ్రాయెల్ మీద 2023 అక్టోబరు 7న హమాస్ దాడి చేసి 1195 మంది ఇజ్రాయెలీలను హతమార్చి 251 మందిని బందీలుగా పట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Aug 2025 4:00 PM ISTఇజ్రాయెల్ మీద 2023 అక్టోబరు 7న హమాస్ దాడి చేసి 1195 మంది ఇజ్రాయెలీలను హతమార్చి 251 మందిని బందీలుగా పట్టుకుపోయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య ఎడతెగని యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సుమారు 70వేల మంది పాలస్తీనీయుల్ని హతమార్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆవును... 2023 అక్టోబరు 7న హమాస్ దాడి చేసి 251 మందిని బందీలుగా పట్టుకుపోయిన హమాస్... తమ చెరలో ఇజ్రాయేలీయులు ఏ స్థాయిలో నరకయాతన అనుభవిస్తుంది చూపించే విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... 665 రోజులుగా నిర్బంధంలో ఉన్న బందీ ఎవ్యతార్ డేవిడ్ జీవితానికి సంబంధించిన రుజువులను చూపించే కొత్త వీడియోను విడుదల చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన ఈ వీడియోను ఇటీవలే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలోని డేవిడ్... సరైన తిండి, వెలుతురు లేక ఎముకల గూడులా మారిపోయాడు. ఇదే సమయంలో కాలకృత్యాలకు సైతం బయటకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారి ఉంది.
ఇలా.. 665 రోజులుగా నిర్బంధంలో ఉన్న బందీ ఎవ్యతార్ డేవిడ్ జీవిత రుజువును విడుదల చేయడం ద్వారా బందీల ఒప్పందం కోసం ఇజ్రాయెల్ పై ఒత్తిడిని పెంచే పనికి పూనుకుందని అంటున్నారు.
కాగా... ఇటీవల ఎవ్యతార్ సోదరుడు ఇలాయ్ డేవిడ్.. అతడి విడుదల కోసం జరుగుతున్న పోరాటం గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా... తన సోదరుడు అత్యంత చెత్త ప్రదేశంలో ఉన్నాడని.. ఒక సొరంగంలో, వెలుతురు లేదు, బాత్రూమ్ లేదని తెలిపారు. అతడు తనను తాను ఉపశమనం చేసుకోవడానికి ఉపయోగించే రంధ్రం పక్కనే తింటాడని తెలిపారు.
అతడు అక్కడున్న ప్రతిరోజు ఒక పీడకలలా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఎవ్యతార్ ను తిరిగి తీసుకురావడానికి తాను ఏదైనా చేస్తానని.. ఇది తన జీవిత లక్ష్యం అని.. మిగిలినవన్నీ తర్వాత స్థానంలో ఉంటాయని తెలిపారు. కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో.. మునుపటి బందీ ఒప్పందం సమయంలో.. హమాస్ ఎవ్యతార్ డేవిడ్, గై గిల్బోవా దలాల్ జీవితానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
