రెండు ప్రాణాల్ని తీసిన హెయిర్ ప్లాంటేషన్.. ఎక్కడీ దారుణమంటే?
గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తన రూపానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం ఎక్కువైంది.
By: Tupaki Desk | 17 May 2025 9:30 AM ISTగతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తన రూపానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం ఎక్కువైంది. గతంలో బట్టతల గురించి బాధపడేవారే తప్పించి.. దాన్ని మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలన్న ఆలోచన ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా.. అది ఖరీదైన వ్యవహారంగా ఉండేది. దీంతో అత్యధికులు ఇలాంటి వాటికి దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. అయితే.. ఈ మార్పులు కొన్నిసార్లు ప్రాణాలు తీసేవిగా ఉండటం షాకింగ్ గా మారుతోంది. తాజాగా అలాంటి దారుణ ఉదంతమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న ఇద్దరు ఇంజినీర్లు.. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న గంటల్లోనే మరణించిన వైనం షాకింగ్ గా మారింది. దీంతో.. సదరు ట్రీట్ మెంట్ ఇచ్చిన వారి కోసం పోలీసులు విచారణ చేపట్టగా..వారు కాస్తా పరారయ్యారు. అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 13న కాన్పూర్ లోని డాక్టర్ అనుష్క తివారీ క్లినిక్ లో హెయిర్ ప్లాంట్ చేయించుకోవటానికి 40 ఏళ్ల వినీత్ దుబే వెళ్లారు. హెయిర్ ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు.
ముఖమంతా వాపు వచ్చేసింది. అనంతరం తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలో మార్చి 14న వినీత్ దుబే మరణించారు. దీంతో అతడి భార్య జయా త్రిపాఠీ యూపీ సీఎం అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. డాక్టర్ అనుష్క తివారీ క్లినిక్ మీద కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే దుబే చనిపోయినట్లుగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
హెయిర్ ప్లాంటేషన్ కు వెళ్లి మరణించిన వినీత్ దుబే వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాగాజా కాన్పూర్ పోలీసుల్ని కుశాగ్ర ఖతియార్ అనే వ్యక్తి ఆశ్రయించారు. తన సోదరుడు 30 ఏళ్ల మాయంక్ ఖతియార్ గత ఏడాది నవంబరులో మరణించారని.. అతను కూడా ఇదే ఆసుపత్రిలో హెయిర్ ప్లాంట్ చేయించుకున్నట్లు చెప్పటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
హెయిర్ ప్లాంట్ చేయించుకున్న తర్వాతి రోజే తీవ్రమైన అనారోగ్యంతో మరణించినట్లుగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. దీంతో ఈ రెండు కేసుల్ని కలిపి విచారించాలా? లేదంటే మరో కేసు పెట్టాలా? అన్న దానిపై పోలీసులు ఆలోచిస్తున్నారు. కేసులు ఎలానమోదు చేసినా.. విచారణ త్వరగా పూర్తి చేస్తే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.
