Begin typing your search above and press return to search.

ఇళ్లు, ఇంటికింద బంకర్, స్పెషల్ పార్క్... పాక్ లో ఉగ్రవాదికి సేఫ్ హౌస్!

ఈ సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాది పాకిస్థాన్ లోని లాహోర్ లో ప్రభుత్వ భద్రత మధ్య సేఫ్ గా ఉన్నట్లు జాతీయ మీడియా సంచలన కథనం వెల్లడించింది.

By:  Tupaki Desk   |   1 May 2025 7:00 AM IST
Hafiz Saeed Living Freely in Lahore
X

దొరకనంత సేపు దొరే అని.. దొరికిన తర్వాత దొంగ అని అంగీకరించక తప్పదని అంటారు. అయితే .. పాకిస్థాన్ మాత్రం అడ్డంగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా బొంకడం పరిపాటిగా చేసుకుంది! ఈ సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాది పాకిస్థాన్ లోని లాహోర్ లో ప్రభుత్వ భద్రత మధ్య సేఫ్ గా ఉన్నట్లు జాతీయ మీడియా సంచలన కథనం వెల్లడించింది.

అవును... పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రవాద దాడి వెనుక ప్రధానంగా లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని భారత్ బలంగా నమ్ముతుంది. ఈ దాడికి పాల్పడినట్లు చెప్పుకుంటున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీ.ఆర్.ఎఫ్).. లష్కరే తోయిబాకు ఇది ఒక బ్రాంచ్ అని అంటున్నారు.

అంటే... తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని భారత నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. హఫీజ్ కు సంబంధించిన ఓ సంచలన కథనం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... లాహోర్ లో ఈ ఉగ్రవాది సేఫ్ గా ప్రభుత్వ భద్రత మధ్య ఉన్నట్లు తెలిపింది.

ఇందులో భాగంగా... హఫీజ్ సయీద్ లాహోర్ లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో జనాలతో కలిసి జీవిస్తున్నారని.. అతడి నివాసానికి పాకిస్థాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఆ కథనం పేర్కొంది. ఆ ఇంటి పక్కనే మసీదు, మదర్సా ఉండగా.. పక్కనే ఓ ప్రైవేటు పార్కు, భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని సదరు కథనం తెలిపింది.

అతడికి పాకిస్థాన్ ప్రభుత్వం 24X7 భద్రతను కల్పించిందని పేర్కొంది. ఈ మేరకు ఉపగ్రహ చిత్రాలను యాక్సిస్ చేసినట్లు వెల్లడించింది. ఇలా పాకిస్థాన్ లో హఫీజ్ సయీద్ బహిరంగంగా జనావాసాల మధ్య నివసిస్తున్నట్లు పలు కథనాలు, సాక్ష్యాలు తెరపైకి వస్తున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం అతడు జైల్లో ఉన్నాడని బుకాయిస్తూనే ఉంది!

కాగా... ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో హఫీజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరెన్నో ఉగ్రదాడుల్లోనూ అతడు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు! ఈ భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హఫీజ్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజా పహల్గాం దాడిలోనూ ఇతడే కీలక సూత్రధారి అని భారత్ భావిస్తోంది.