Begin typing your search above and press return to search.

హెచ్‌-1బీ వీసాల్లో మోసాలు... అమెరికా కీలక నిర్ణయం!

ఇందులో భాగంగా హెచ్-1బి వీసా ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చివేయాలని నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 10:44 AM GMT
హెచ్‌-1బీ వీసాల్లో మోసాలు...  అమెరికా కీలక నిర్ణయం!
X

సమగ్రతను పెంపొందించడం, మోసాలను తగ్గించడం లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా హెచ్-1బి వీసా ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చివేయాలని నిర్ణయించింది. ప్రధానంగా... వార్షిక లాటరీ విధానంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేయడంతోపాటు అందుకు కారణమవుతున్న లోపాలను సవరించే దిశగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

అవును... హెచ్‌-1బీ వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు యునైటెడ్ స్టేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇందులో భాగంగా... ఇకపై ఒక లబ్ధిదారు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా.. వ్యక్తిగత వివరాల ఆధారంగా ఒక అప్లికేషన్‌ గానే పరిగణిస్తారు. దీనివల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఒకే లబ్ధిదారుని తరఫున అనేక అప్లికేషన్లు సమర్పించి.. పలు సంస్థలు లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని.. అందువల్ల అమెరికా ఈ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఈ విషయంపై స్పందించిన అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూ.ఎస్‌.సీ.ఐ.ఎస్‌) విభాగం... రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ కొత్త నిబంధనలను 2025 ఆర్థిక సంవత్సరానికి మొదలయ్యే హెచ్‌-1బీ వీసాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమై అదే నెల 22న ముగియనుంది. దీనికి గాను యూ.ఎస్‌.సీ.ఐ.ఎస్‌. ఆన్‌ లైన్‌ అకౌంట్ నే అప్లికెంట్స్ వినియోగించాల్సి ఉంటుంది. దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లింపు దీని ద్వారానే జరుగుతుంది.

కాగా... హెచ్‌-1బీ వీసాలను కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానంతో జారీ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే, కొంత కాలంగా ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా ఒక్కరే చాలా రిజిస్ట్రేషన్లు సమర్పించి.. లాటరీ విధానంలో అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే వీటిని అరికట్టేందుకు తాజా నిబంధనలు తీసుకొచ్చారని చెబుతున్నారు.