హెచ్1బీ వీసాలపై ట్రంప్ పాలన ముద్ర: సీనియారిటీ, జీతాలకు పెరిగిన ప్రాధాన్యత?
ప్రస్తుతం లాటరీ విధానంలో భారతీయులు భారీగా లబ్ది పొందుతున్నారు. ఎందుకంటే అనేక ఐటీ కంపెనీలు వేలాదిగా దరఖాస్తులు సమర్పించి ఎక్కువ వీసాలను పొందుతున్నాయి.
By: Tupaki Desk | 22 July 2025 8:35 AM ISTవందల వేల మంది భారతీయులు ఎదురుచూస్తున్న హెచ్1బీ వీసా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక గత మొదటి దఫా పాలనలో ప్రవేశపెట్టిన కొన్ని కఠిన నిబంధనలు మళ్లీ అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్1బీ వీసాల ఎంపికలో లాటరీ విధానం రద్దయి, సీనియారిటీ, జీతాలకు ప్రాధాన్యత లభించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) వైట్‌హౌస్‌లోని OIRAకి ఒక ప్రతిపాదనను పంపింది. ఇది ట్రంప్ పరిపాలనలో ప్రోత్సహించబడిన విధానాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలు, అమెరికాలో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
-2026కి లాటరీ విధానం రద్దు: సీనియారిటీ, జీతాలకే ప్రాధాన్యత?
గత శుక్రవారం యూఎస్ సిటిజన్ షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2026 సంవత్సరానికి హెచ్1బీ వీసాల కోటా పూర్తయింది. అంటే ఈ ఏడాది కొత్తగా లాటరీ ద్వారా దరఖాస్తుల ఎంపిక ఉండదు. ఈ పరిణామం హెచ్1బీ వీసాల ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేసి సీనియారిటీ , జీతాల ఆధారంగా వీసాలను కేటాయించే అవకాశాలను బలోపేతం చేస్తోంది. అయితే ఈ మార్పు 2025 వరకు ప్రభావం చూపదు. అప్పటివరకు లాటరీ విధానమే కొనసాగనుంది.
-టాపర్లకు ఛాన్స్.. ట్రంప్ వైఖరి
ట్రంప్ తన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వీసా లాటరీ విధానాన్ని రద్దు చేసి జీతం ఆధారంగా ఎంపిక చేసే పద్ధతిని ప్రతిపాదించారు. "అమెరికాకు సాధారణ నైపుణ్యాలు ఉన్నవారు కాదు.. అసలైన నిపుణులు కావాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యుత్తమ నైపుణ్యం గల వారిని మాత్రమే అనుమతించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు. బైడెన్ పరిపాలనలో ఈ విధానం వెనక్కిపోయినా ఇప్పుడు అదే మార్గం వైపు తిరిగి వెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్ నివేదించిన వివరాల ప్రకారం.. పాత నిబంధనలు తిరిగి రాకపోయినా, లాటరీ విధానాన్ని పూర్తిగా తొలగించి, జీతం , ఉద్యోగ స్థాయి ఆధారంగా ఎంపిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- ఇనిస్టిట్యూట్ ఫర్ ప్రొగెసిస్ సిఫార్సులు: వీసా విలువ పెరుగుతుంది!
ఇనిస్టిట్యూట్ ఫర్ ప్రొగెసిస్ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదికలో లాటరీ విధానాన్ని తొలగించాలని, దాని స్థానంలో జీతం, ఉద్యోగంలో సీనియారిటీ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. ఈ విధానాన్ని అమలుచేస్తే హెచ్1బీ వీసా విలువ 88% పెరుగుతుందని వారి అంచనా.
- భారతీయులకు భారీ దెబ్బ తప్పదా?
ప్రస్తుతం లాటరీ విధానంలో భారతీయులు భారీగా లబ్ది పొందుతున్నారు. ఎందుకంటే అనేక ఐటీ కంపెనీలు వేలాదిగా దరఖాస్తులు సమర్పించి ఎక్కువ వీసాలను పొందుతున్నాయి. కానీ ఇప్పుడు జీతం ఆధారంగా ఎంపిక చేస్తే.., చిన్న స్థాయి ఉద్యోగులు, కొత్తగా ఉద్యోగం ప్రారంభించిన అభ్యర్థులకు అవకాశం తగ్గుతుంది.
ఈ మార్పులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయుల ఆశలకు గట్టి ఎదురుదెబ్బగా మారవచ్చు. సారాంశంగా చెప్పాలంటే.. హెచ్1బీ వీసా విధానంలో రానున్న మార్పులు, లాటరీ పద్ధతిని తొలగించి జీతం, సీనియారిటీ ఆధారంగా ఎంపిక జరిగితే.. ఉన్నత నైపుణ్యం ఉన్నవారికి ఇది అవకాశంగా మారవచ్చు. అయితే కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం చూసే భారతీయులకు ఇది గట్టి ఎదురుదెబ్బ అయే అవకాశం ఉంది.
