హెచ్-1బీ వీసా వచ్చినా ఉద్యోగం లేదు.. అమెరికన్ కంపెనీల మోసం?
హెచ్-1బీ 2025 సంవత్సరానికి ఒక భారతీయ యువకుడు లాటరీలో ఎంపికయ్యాడు. ఇది అతనికి ఎంతో కీలకమైన మైలురాయి.
By: Tupaki Desk | 28 Jun 2025 9:01 AM ISTకోట్ల ఆశలతో అమెరికాలో ఉద్యోగం చేయాలని చూసే భారతీయ యువతకు హెచ్-1బీ వీసా అనేది ఒక అవకాశం మాత్రమే. ఈ వీసా దొరకడమే కష్టం అనుకుంటే, అది వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ వాస్తవాన్ని మరోసారి రుజువు చేశాయి.
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే అనేక మంది భారతీయులకు హెచ్-1బీ వీసానే ఏకైక మార్గం. ఈ వీసా లాటరీ గెలవడమే పెద్ద అడ్డంకి అని చాలా మంది భావిస్తారు. కానీ, ఇటీవల జరిగిన సంఘటనలు "లాటరీ గెలవడమే సర్వస్వం కాదు" అనే చేదు నిజాన్ని వెల్లడిస్తున్నాయి.
-ఆఫర్ వచ్చినా వెనక్కి: నిరాశలో యువత
హెచ్-1బీ 2025 సంవత్సరానికి ఒక భారతీయ యువకుడు లాటరీలో ఎంపికయ్యాడు. ఇది అతనికి ఎంతో కీలకమైన మైలురాయి. అప్పటికే అతనికి ఒక కంపెనీ నుండి మౌఖికంగా ఉద్యోగ ఆఫర్ వచ్చింది. వీసా అక్టోబర్‌లో అమలులోకి వస్తుండగా అతను నవంబర్ లేదా డిసెంబర్‌లో పని ప్రారంభించాలని ఒప్పందం కుదిరింది. కానీ ఆ కంపెనీ అకస్మాత్తుగా ఆ ఆఫర్‌ను వెనక్కి తీసుకుంది. కారణం? వీసా ప్రక్రియలో ఆపరేషన్ డిలేలు అంటే, వీసా జారీ కావడంలో జాప్యం అవుతుందని చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా వెనక్కి తగ్గింది.
ఇది ఒక్కరికి జరిగిన సంఘటన కాదు. ఇటీవలి కాలంలో అమెరికా కంపెనీలు హెచ్-1బీ, ఎఫ్-1 (OPT) వీసా హోల్డర్లను నియమించుకునే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. USCIS ( అమెరికా సిటిజన్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) మరింత కఠినమైన తనిఖీలు చేస్తుండటంతో కంపెనీలు అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
- అనిశ్చితి, ఆందోళన
వీసా మంజూరులో ఆలస్యం, ధోఖా కేసులు పెరుగుదల, లీగల్ ఫార్మాలిటీల భయం ఇవన్నీ కంపెనీలను హెచ్-1బీ ఉద్యోగులను రిక్రూట్ చేయడంలో వెనక్కి తిప్పుతున్నాయి. దీంతో అనేక మంది భారతీయ ఐటీ నిపుణులు మానసికంగా బాధపడుతున్నారు. ఒకవైపు వీసా లాటరీ గెలవడాన్ని విజయంగా భావిస్తే, మరోవైపు ఉద్యోగం దక్కకపోవడం వారి కలలను ఛిన్నాభిన్నం చేస్తోంది.
ఈ విధమైన అనిశ్చితి భారత యువతలో భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై నమ్మకాన్ని తగ్గిస్తోంది. “అమెరికాలో స్థిరపడే కలలు నిజం అవుతాయా?” అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
- పారదర్శకత అవసరం
అమెరికా కంపెనీలు నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి. వీసా హోల్డర్లను మోసం చేయడం వల్ల వారు తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. USCIS కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. ఒకసారి ఎంపికైన హెచ్-1బీ అభ్యర్థులకు కనీస భద్రత ఉండాలి. అప్పుడు మాత్రమే విదేశాల్లో ఉద్యోగం అనే కల నెరవేరుతుంది. లేకపోతే హెచ్-1బీ వీసా అనేది ఒక తీరని కలే అవుతుంది.
