అమెరికాలో భారీ హెచ్-1బీ స్కామ్: కటకటాల వెనక్కి తెలుగు ఎన్ఆర్ఐలు!
వీరిద్దరూ కుమ్మక్కై 2020 నుంచి 2023 మధ్యకాలంలో ఒక పక్కా ప్లాన్‌తో వీసా మోసాలకు తెరలేపారు.
By: A.N.Kumar | 20 April 2026 11:13 AM ISTఅమెరికాలో విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించిన హెచ్-1బీ వీసా వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక భారీ వీసా స్కామ్ ప్రవాస భారతీయులలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగు మూలాలున్న ఇద్దరు ఎన్ఆర్ఐలు వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు అమెరికా ఫెడరల్ అధికారులు నిర్ధారించారు.
ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా సంపత్ రాజిడి, శ్రీధర్ మాడ అనే ఇద్దరిని అధికారులు గుర్తించారు. 51 ఏళ్ల వయసున్న వీరిద్దరూ కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరంలో నివసిస్తున్నారు. సంపత్ రాజిడి “ఎస్-టీమ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌క్” , “అప్‌ట్రెండ్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌సీ” అనే రెండు కన్సల్టెన్సీ సంస్థలను నడుపుతున్నాడు. మరోవైపు శ్రీధర్ మాడ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం.
వీరిద్దరూ కుమ్మక్కై 2020 నుంచి 2023 మధ్యకాలంలో ఒక పక్కా ప్లాన్‌తో వీసా మోసాలకు తెరలేపారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ, తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. వాస్తవానికి అక్కడ ఎటువంటి ఖాళీలు లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా చూపిస్తూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) ను తప్పుదోవ పట్టించారు.
వ్యవస్థను తప్పుదోవ పట్టించిన వైనం
వీరు అనుసరించిన విధానం అత్యంత ప్రమాదకరమైనది. యూనివర్సిటీ పేరుతో వీసాలు పొందిన తర్వాత ఆ కార్మికులను యూనివర్సిటీ విధులకు కాకుండా సంపత్ రాజిడికి చెందిన కన్సల్టెన్సీల ద్వారా ప్రైవేట్ కంపెనీలకు పంపించేవారు. ఇలా చేయడం ద్వారా వీసా నిబంధనలను తుంగలో తొక్కడమే కాకుండా భారీగా కమీషన్లు వసూలు చేస్తూ వాణిజ్య ప్రయోజనం పొందారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వలస చట్టాలలోని పవిత్రతను వీరు వ్యాపార వస్తువుగా మార్చేశారు.
కఠిన చర్యలు.. శిక్షా కాలం
అమెరికాలో ప్రస్తుతం వలస విధానాలపై అత్యంత కఠినమైన నిబంధనలు అమలవుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం వీసా మోసాలపై “జీరో టాలరెన్స్” విధానాన్ని అవలంబిస్తోంది. ఈ క్రమంలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు నిశితంగా పరిశీలించడంతో ఈ కుంభకోణం గుట్టు రట్టయింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అమెరికా చట్టాల ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు ₹2 కోట్లు) భారీ జరిమానా విధించవచ్చు. ఈ కేసులో తుది తీర్పును కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి ట్రాయ్ ఎల్ నన్లీ జూలై 30, 2026న వెలువరించనున్నారు.
భారతీయుల ప్రతిష్టకు భంగం
ఇలాంటి ఘటనలు కేవలం వ్యక్తిగత నేరాలుగా మాత్రమే మిగిలిపోవు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది నిజాయితీ గల భారతీయ ఐటీ నిపుణుల ప్రతిష్టను ఇవి దెబ్బతీస్తాయి. వీసా నిబంధనల ఉల్లంఘన వల్ల భవిష్యత్తులో నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులు వీసాలు పొందడం కష్టతరంగా మారుతుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ వ్యవస్థకు మచ్చ తెచ్చే పనులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
