H-1B ట్రాన్స్‌ఫర్.. 60 రోజుల్లో మార్పు జరగకపోతే..పరిస్థితేంటి?
అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయ ఐటీ నిపుణులు H-1B వీసాపై ఆధారపడి ఉంటారు.
By: Tupaki Desk | 1 Jun 2025 6:00 PM ISTఅమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయ ఐటీ నిపుణులు H-1B వీసాపై ఆధారపడి ఉంటారు. ఈ వీసా ద్వారా ఉద్యోగం కోల్పోయిన తర్వాత 60 రోజుల గరిష్ట గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఈ వ్యవధిలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి H-1B ట్రాన్స్‌ఫర్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 60 రోజుల వ్యవధిలో మార్పు జరగకపోతే, ఇమ్మిగ్రేషన్ స్టేటస్ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఒక వ్యక్తి మే 1, 2025న తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అంటే అతనికి జూన్ 30, 2025 వరకు మాత్రమే కొత్త ఉద్యోగం కోసం వెతకడానికి లేదా H-1B ట్రాన్స్‌ఫర్ ప్రారంభించడానికి సమయం ఉంది. శుభపరిణామం ఏమిటంటే అతను ఇప్పటికే కొత్త ఉద్యోగం పొందారు. అలాగే ఆ కంపెనీ LCA దాఖలు చేసింది. కానీ H-1B ట్రాన్స్‌ఫర్ పిటిషన్ మాత్రం మరల వారం రోజుల్లో అంటే జూన్ 30 లోపు ఫైల్ చేయనున్నారు.
- ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయా?
వాస్తవానికి 60 రోజుల లోపు దాఖలైన చేంజ్ ఆఫ్ ఎంప్లాయిర్ (COE) పిటిషన్లు ఎక్కువగా ఆమోదించబడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో యూఎస్.సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) నుండి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (Request for Evidence) రావచ్చు. ముఖ్యంగా పత్రాలు సరైన క్రమంలో లేనప్పుడు లేదా కొత్త ఉద్యోగం పూర్తిగా వేరు రంగంలో ఉన్నట్లు అనిపించినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. యూఎస్.సీఐఎస్ దృష్టిలో కొత్త ఉద్యోగం కూడా H-1B ప్రమాణాలకు సరిపోవాలి. లేకపోతే పిటిషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
జూన్ 30 తర్వాత పిటిషన్ తిరస్కరించబడితే ఆ వ్యక్తి తన ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ను కోల్పోతాడు. అంటే అమెరికాలో ఉండేందుకు చట్టబద్ధమైన హక్కు ఉండదు. ఈ పరిస్థితిలో ఉన్నవారికి చాలా పరిమితమైన ఎంపికలే మిగులుతాయి. అమెరికా నుండి బయటకు వెళ్లడం లేదా ఇతర వీసా మార్గాలను పరిశీలించడం.
-ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి?
H-1B ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం:
సమయానికి పిటిషన్ ఫైలింగ్ చేయాలి. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లోపే పిటిషన్ ఫైలింగ్ పూర్తి చేయాలి.పూర్వ ఉద్యోగపు రిలీవింగ్ లెటర్, తాజా పే స్టబ్స్, ఆఫర్ లెటర్, LCA, ప్రాజెక్ట్ డిటైల్స్ మొదలైన అన్ని పత్రాలను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాలి. కొత్త ఉద్యోగం యొక్క జాబ్ డిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాలి. ఇది H-1B వీసా అర్హతల పరిధిలో ఉందని నిరూపించగలగాలి. ప్రాసెసింగ్‌లో ఆలస్యం జరగకుండా చూసుకోవడానికి, కొత్త యజమానితో నిరంతరం సమన్వయం చేసుకోవడం ముఖ్యం. అనుకోని పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి, H-4 వీసాకు మార్పు, ప్రయాణ ప్రణాళిక, లేదా ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు అప్లై చేయడం వంటి వికల్పాలను పరిశీలించాలి.
H-1B వీసా గల వ్యక్తులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన ఒక ఊరటగా కనిపించవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఇది ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, ఆఫర్లు, ఎల్.సీఏ, యూఎస్.సీఐఎస్ ఫైలింగ్ వంటి అనేక దశలతో నిండిన ప్రక్రియ. అందుకే ఎప్పటికైనా ముందస్తు ప్రణాళిక, పత్రాల సరైన సిద్ధత, సమయానికి అప్లికేషన్ కీలకం. ఒక చిన్న ఆలస్యం కూడా చట్టబద్ధతను కోల్పోయే పరిస్థితికి దారి తీయవచ్చు.
